RCB: ఆర్సీబీ ఆక్షన్ వీడియో లీక్.. కప్పు కోసం ఇంత స్కెచ్ వేశారా?
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:15 AM
ఆర్సీబీ జట్టుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తీసిన ఈ వీడియోలో బెంగళూరు ప్లానింగ్ చేసిన తీరు చూస్తే మతి పోవాల్సిందే.

ఐపీఎల్‌లో మోస్ట్ పాపులర్ టీమ్స్‌లో ఒకటి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ జట్టుకు భారీ అభిమాన గణం ఉంది. 17 ఏళ్లలో ఒక్కసారి కూడా విజేతగా నిలవకపోయినా ఆ టీమ్‌కు ఏటికేడు ఫ్యాన్‌బేస్ మరింత పెరుగుతూ వచ్చింది. అయితే కప్పు గెలవకపోవడంతో ఎన్నో విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొన్న ఆర్సీబీ ఎట్టకేలకు ఐపీఎల్-2025తో ట్రోఫీ కలను నెరవేర్చుకుంది. పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌లో చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది కోహ్లీ టీమ్. అయితే ఈ విజయంలో పైకి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన కనిపిస్తున్నా.. ఈ కప్పు కోసం వెనుక వైపు టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన కృషి మాత్రం చాలా మందికి తెలియదు. అలాంటి వారు ఈ వీడియో తప్పక చూడాల్సిందే.
వాళ్లను తీసుకోవాల్సిందే..
ఐపీఎల్-2025 మెగా ఆక్షన్‌కు ముందు ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన ఓ మీటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, మెంటార్ దినేష్ కార్తీక్‌తో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బొబట్, టీమ్ మేనేజర్ సౌమ్యదీప్‌ను ఈ వీడియోలో చూడొచ్చు. భువనేశ్వర్ కుమార్.. బెస్ట్ టీ20 బౌలర్ అని, అతడ్ని ఎలాగైనా టీమ్‌లోకి తీసుకోవాల్సిందేనని కార్తీక్ చెప్పడాన్ని వీడియోలో చూడొచ్చు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ హేజల్‌వుడ్ గురించి కూడా అందులో డీకే ప్రస్తావించాడు. అతడు గన్ బౌలర్ అని మెచ్చుకున్నాడు.
వాటే స్కెచ్..
జితేష్ శర్మ ఈజ్ ది బెస్ట్ అని దినేష్ కార్తీక్‌తో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బొబట్ చెప్పడం వీడియోలో చూడొచ్చు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ గురించి కూడా ఫ్రాంచైజీ మీటింగ్‌లో మాట్లాడటం గమనించొచ్చు. టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్‌ను ఎలాగైనా తీసుకోవాల్సిందేనని డీకే అంటుండటాన్ని కూడా గమనించొచ్చు. ఫిల్ సాల్ట్‌తో పాటు ఇతర ఆటగాళ్ల ప్రతిభ, వాళ్లను వేలంలో ఎలా దక్కించుకోవడం లాంటి అంశాలపై టీమ్ మేనేజ్‌మెంట్ చర్చిస్తుండటం వీడియోలో చూడొచ్చు. ఇది చూసిన నెటిజన్స్.. మెగా ఆక్షన్ సమయంలోనే డీకే అండ్ కో గట్టి స్కెచ్ వేశారని చెబుతున్నారు. జట్టు గెలుపు కోసం ఏయే ఆటగాళ్లను తీసుకోవాలి, వాళ్ల సేవల్ని ఎలా వాడుకోవాలనే ప్రణాళిక వేశారని అంటున్నారు. ఇంత గట్టిగా ప్లానింగ్ చేశారు కాబట్టే ట్రోఫీ ఎగరేసుకుపోయారని.. ఇందులో టీమ్ మేనేజ్‌మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే?
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి