Pat Cummins: కటౌట్ ఎత్తుకెళ్లిన కమిన్స్.. వీడియో చూస్తే నవ్వాగదు!
ABN , Publish Date - May 21 , 2025 | 06:24 PM
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డ్‌లో కాస్త గంభీరంగా కనిపిస్తాడు. కానీ మైదానం బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడు. తోటి ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ప్లేయర్లనూ కలుపుకొని పోతాడు. అలాంటోడు తాజాగా చేసిన ఓ పని అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్ మైదానంలో కాస్త గంభీరంగా కనిపించినా.. గ్రౌండ్ దాటితే చాలా కూల్‌గా ఉంటాడు. సొంత జట్టు ఆటగాళ్లతో పాటు ఇతర టీమ్స్ ప్లేయర్లతోనూ సులువుగా కలసిపోతాడు. యువకులు, ఇతర ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు జోక్స్ కూడా వేస్తుంటాడు. తాజాగా అలాంటి ఓ పని చేసి అందర్నీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు కమిన్స్. కటౌట్ ఎత్తుకెళ్లి ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేశాడు సన్‌రైజర్స్ సారథి. ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వాగదు. అసలేం జరిగిందంటే..
కటౌట్ పట్టుకొని..
లక్నో సూపర్ జెయింట్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మే 19న మ్యాచ్ జరిగింది. ఇందులో 6 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది కమిన్స్ సేన. 205 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 10 బంతులు ఉండగానే ఛేదించింది ఆరెంజ్ ఆర్మీ. దీంతో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలుద్దామని అనుకున్న పంత్ సేన ఆశలు ఆవిరయ్యాయి. విజయాల్లేక అల్లాడుతున్న ఎస్‌ఆర్‌హెచ్ ఈ గెలుపుతో ఊపిరి పీల్చుకుంది. కాగా, మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ కటౌట్ తీసుకెళ్తూ కనిపించాడు కమిన్స్. ఆ కటౌట్‌తో సన్‌రైజర్స్ టీమ్ బస్‌లోకి వచ్చిన ప్యాట్.. మార్ష్ ఫొటో చూపిస్తూ తన ఫ్రెండ్ అని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమిన్స్ చేసిన పనికి బస్‌లోని మిగిలిన ఆటగాళ్లంతా పడి పడి నవ్వారు. ఇది టీమ్ హోటల్ దగ్గర్లో తీసినదా లేదా లక్నో నగరంలోని మరేదైనా ప్రాంతంలో తీసిన వీడియోనా అనేది క్లారిటీ లేదు. ఇది చూసిన నెటిజన్స్.. బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారేమోనని అంటున్నారు. వాటే ఫ్రెండ్‌షిప్ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి