Share News

MS Dhoni: సాకులు చెబుతున్న ధోని.. ఇంతకంటే అవమానం ఉండదు!

ABN , Publish Date - May 21 , 2025 | 03:13 PM

చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలైన సీఎస్‌కే పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానానికి చేరింది. ఈ తరుణంలో ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

MS Dhoni: సాకులు చెబుతున్న ధోని.. ఇంతకంటే అవమానం ఉండదు!
MS Dhoni

కప్పు రేసులో ముందంజలో ఉంటుందనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్‌ సీజన్‌ను చివరి స్థానంతో ముగించేలా ఉంది. రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో చిత్తయింది ధోని సేన. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో మాత్రం విఫలమైంది. దీంతో ఓదార్పు విజయం కూడా మిస్ అయింది. మొత్తంగా ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచుల్లో 3 విజయాలు, 10 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో ఆఖరు స్థానానికి పరిమితమైంది. దీంతో ఆ జట్టుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆ టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేసిన వ్యాఖ్యలు విమర్శల్ని మరింతగా పెంచాయి. ఇంతకీ మాహీ ఏం అన్నాడంటే..


స్ట్రైక్ రేట్ ఎంత?

అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురవడం సహజమేనని ధోని అన్నాడు. కానీ దీన్ని జయించాల్సిన అవసరం ఉందన్నాడు. సీనియర్ ప్లేయర్లు, కోచింగ్ సిబ్బంది నుంచి యువ ఆటగాళ్లు కీలక విషయాలు నేర్చుకోవాలని సూచించాడు. 200 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయాలని అనుకున్నప్పుడు నిలకడగా పరుగులు చేయడం కష్టమేనని ధోని చెప్పుకొచ్చాడు. యువకులను ఉద్దేశించి మాహీ ఇచ్చిన సలహాలు మంచివేనని.. కానీ అతడు ఎంత స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడో చూసుకోవాలని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ధోని 17 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అందులో ఒక సిక్స్ ఉంది.


ఒక్కరైనా ఆడారా?

ఒక సిక్స్ మాత్రమే కొట్టిన ధోని యువ ఆటగాళ్లను స్ట్రైక్ రేట్ విషయంలో సలహాలు ఇవ్వడం ఏంటని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అతడు గనుక బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందుగా వచ్చి భారీ షాట్లు బాదితే యంగ్‌స్టర్స్ మీద ఉండే ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. ఒకప్పుడు ధోని దంచుడే దంచుడు అనే ఆటతీరుతో అదరగొట్టిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు అతడు 10 నుంచి 15 బంతులు ఆడితే గొప్ప అనేలా పరిస్థితి ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యువకులతో ఏం చేయించాలో అది కెప్టెన్‌గా ధోని చేసి ఉదాహరణగా నిలిస్తే బాగుండేదని, వాళ్లపై ప్రెజర్ కూడా తగ్గేదని అంటున్నారు. మాటలతో కోటలు కడదామంటే కుదరదని.. స్ట్రైక్ రేట్ గురించి ఇలాంటి మాటలతో పరువు తీసుకోవద్దని నెటిజన్స్ సూచిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పైన ఒక్కరంటే ఒక్క సీనియర్ బ్యాటర్ బాగా ఆడి ఉన్నా లేదా ధోని స్వయంగా సిచ్యువేషన్స్‌ను డీల్ చేసినా సీఎస్‌కేకు ఈ గతి పట్టేది కాదని మండిపడుతున్నారు. అతడి పనైపోయిందని, ఇక జట్టును వీడాల్సిన సమయం వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

డోపింగ్‌లో పట్టుబడ్డ శివ్‌పాల్‌

ముంబై జట్టులో బెయిర్‌స్టో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 03:16 PM