Shubman Gill: ఒక్క తప్పుతో అంతా నాశనం.. ఇదేం కెప్టెన్సీ గిల్!
ABN , Publish Date - May 31 , 2025 | 03:11 PM
సారథి శుబ్‌మన్ గిల్ చేసిన ఒక్క తప్పుతో క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్ నుంచి ఇంటిదారి పట్టింది గుజరాత్ టైటాన్స్. మరి.. గిల్ చేసిన ఆ మిస్టేక్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025 నుంచి ఇంటిదారి పట్టింది గుజరాత్ టైటాన్స్. సీజన్ ఆరంభం నుంచి వరుస విజయాలతో దుమ్మురేపిన జీటీ.. లీగ్ దశ చివర్లో పట్టాలు తప్పింది. వరుస మ్యాచుల్లో ఓడి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. దీంతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయినా ఎలిమినేటర్‌లో ఆడక తప్పలేదు. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ ఫైట్‌లో జీటీ 20 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. ఆ జట్టు ఓటమికి ఆటగాళ్ల వైఫల్యంతో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తప్పిదం కూడా ప్రధాన కారణమనే చెప్పాలి. ముఖ్యంగా బౌలింగ్ సమయంలో అతడు తీసుకున్న నిర్ణయాలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. ఆ డెసిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇదేం ప్లానింగ్..
ముంబైతో మ్యాచ్‌లో బౌలింగ్ రొటేషన్‌లో గిల్ పూర్తిగా విఫలమయ్యాడు. అందుబాటులో ఉన్న బౌలర్లతో ఎప్పుడు బౌలింగ్ చేయించాలనే విషయంలో అతడు అనేక తప్పులు చేశాడు. ముఖ్యంగా సీజన్ మొత్తం అదరగొడుతూ వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ విషయంలో గిల్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఫుల్ ఫామ్‌లో ఉన్న ప్రసిద్ధ్ ఈ ఐపీఎల్ మొత్తం మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ సక్సెస్ అయ్యాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అలాంటోడితో ముంబైతో మ్యాచ్‌లో పవర్‌ప్లేలో బౌలింగ్ చేయించాడు గిల్. ఇది పూర్తిగా బెడిసికొట్టింది.
టర్నింగ్ పాయింట్..
రోహిత్ శర్మ (81)తో పాటు జానీ బెయిర్‌స్టో (47) ప్రసిద్ధ్ బౌలింగ్‌లో విరుచుకుపడ్డారు. బౌండరీలతో పాటు సిక్సులు బాదుతూ అతడ్ని కోలుకోకుండా చేశారు. వీళ్ల దెబ్బకు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడతను. మొత్తంగా 4 ఓవర్లలో 2 వికెట్లు తీసినా ఏకంగా 53 పరుగులు ఇచ్చుకున్నాడు ప్రసిద్ధ్. మిడిల్ ఓవర్లలో టైట్ లెంగ్త్స్ వేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ఈ యంగ్ పేసర్‌తో ఆరంభంలో అవే విధమైన బంతులు వేయించాడు గిల్. దీంతో రోహిత్-బెయిర్‌స్టో అతడ్ని ఆటాడుకున్నారు. తొలి స్పెల్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ధ్.. 17వ ఓవర్‌లో రోహిత్, 19వ ఓవర్‌లో నమన్ ధీర్‌ను ఔట్ చేశాడు. దీంతో అతడి ఓవర్లే మ్యాచ్‌ను మలుపు తిప్పాయని, ఆరంభంలో 20 నుంచి 25 పరుగులు అదనంగా ఇచ్చేశాడని నెటిజన్స్ అంటున్నారు. ముంబై-జీటీకి మధ్య పరుగుల అంతరం కూడా ఇరవై అని చెబుతున్నారు. గిల్ బౌలింగ్ చేంజెస్‌తో పాటు క్యాచులు పట్టుకోవడంలో ఫీల్డర్ల వైఫల్యం గుజరాత్‌కు శాపంగా మారిందని కామెంట్స్ చెబుతున్నారు. బౌలర్ బలాన్ని బట్టి సరైన సమయంలో బౌలింగ్‌కు దింపి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి