Jasprit Bumrah: బుమ్రా లేకపోయినా బేఫికర్.. గిల్-గంభీర్ ధైర్యానికి కారణం?
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:22 AM
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. 5 టెస్టుల ఈ సిరీస్‌లో మూడింట్లో మాత్రమే బుమ్రా ఆడనున్నాడు. అయితే గంభీర్-గిల్ ద్వయం మాత్రం అతడు లేకపోయినా బేఫికర్ అంటున్నారు. మరి.. వాళ్ల ధైర్యానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

గత రెండు నెలలుగా అంతా ఐపీఎల్-2025 హడావుడిలో ఉండిపోయారు. ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి అభిమానుల వరకు అంతా క్యాష్ రిచ్ లీగ్ మూడ్‌లోనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఐపీఎల్ ముగియడంతో ఇప్పుడు అంతా ఇంటర్నేషనల్ క్రికెట్ వైపు దృష్టి సారిస్తున్నారు. భారత జట్టు మ్యాచులు ఎప్పుడు ఉంటాయా అని ఆరా తీస్తున్నారు. ఈ సీజన్‌ను టెస్టులతో మొదలుపెట్టనుంది టీమిండియా. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న మెన్ ఇన్ బ్లూ.. అక్కడ 5 టెస్టులు ఆడనుంది. రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు రిటైర్మెంట్ ఇచ్చేయడంతో.. ప్రతిభ కలిగిన కుర్రాళ్లను నమ్ముకుంటోంది భారత్. అయితే పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాతోనే అసలు చిక్కు వచ్చిపడింది. అతడు ఎన్ని మ్యాచులు ఆడతాడో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
ఆలౌట్ చేయగలరా..
బుమ్రా 3 టెస్టులే ఆడతాడని జట్టు ఎంపిక సమయంలో సెలెక్టర్లు స్పష్టం చేశారు. అయితే ఏ మూడు టెస్టులు ఆడతాడో క్లారిటీ ఇవ్వలేదు. అయితే బుమ్రా లేకపోయినా బేఫికర్ అని హెడ్ కోచ్ గౌతం గంభీర్, కొత్త సారథి శుబ్‌మన్ గిల్ అంటున్నారు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం కష్టమేనని.. కానీ తమ బౌలింగ్ యూనిట్లో క్వాలిటీ ఉందని చెబుతున్నారు. దీంతో అసలు గౌతీ-గిల్ ధైర్యానికి కారణం ఏంటి.. బుమ్రా లేకపోయినా ప్రత్యర్థిని ఆలౌట్ చేసే దమ్ము మన బౌలింగ్ దళానికి ఉందా.. అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఇదే రీజన్..
ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో బుమ్రాను మినహాయిస్తే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి బౌలర్లుగా ఉన్నారు. ఇందులో జడ్డూ, నితీష్, సుందర్, శార్దూల్ ఆల్‌రౌండర్లు. మిగిలిన వాళ్లంతా స్పెషలిస్ట్ బౌలర్లు. సిరాజ్, జడేజా, శార్దూల్‌కు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉంది. సిరాజ్-శార్దూల్ అక్కడి పిచ్‌లపై చెలరేగి బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. స్వింగ్, పేస్‌కు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్‌ల మీద అర్ష్‌దీప్, ఆకాశ్‌దీప్ చెలరేగి బౌలింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అక్కడ ఇంకా వేసవి ముగియలేదు. కాబట్టి జడేజా, కుల్దీప్ స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసే చాన్స్ ఉంది. ఇలా వైవిధ్యమైన బౌలర్లు అందుబాటులో ఉండటంతోనే బుమ్రా లేకపోయినా భయపడాల్సిందేమీ లేదని గంభీర్-గిల్ అన్నారని నెటిజన్స్ చెబుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి