Share News

Gautam Gambhir: రోహిత్- కోహ్లీ రిటైర్‌మెంట్‌పై గంభీర్ రియాక్షన్.. ఇలా అనేశాడేంటి!

ABN , Publish Date - May 23 , 2025 | 04:55 PM

టీమిండియా మూలస్తంభాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. దీంతో సుదర్ఘ ఫార్మాట్‌లో వాళ్లను ఎవరు భర్తీ చేస్తారనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో రోకో రిటైర్‌మెంట్‌పై స్పందించాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. అతడేం అన్నాడంటే..

Gautam Gambhir: రోహిత్- కోహ్లీ రిటైర్‌మెంట్‌పై గంభీర్ రియాక్షన్.. ఇలా అనేశాడేంటి!
Gautam Gambhir

దశాబ్దంన్నర కాలం పాటు భారత టెస్ట్ టీమ్‌కు మూలస్తంభంగా ఉంటూ వచ్చారు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ. బ్యాటర్లుగానే గాక కెప్టెన్లు గానూ జట్టుకు సేవలు అందించారు. టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకోవడం, స్వదేశంతో పాటు విదేశాల్లోనూ పెత్తనం చలాయించడంలో ఈ ఇద్దరు స్టార్లు కీలక పాత్ర పోషించారు. అయితే ఉన్న పళంగా వీళ్లు రిటైర్‌మెంట్ ప్రకటించారు. మొదట రోహిత్, ఆ తర్వాత విరాట్ టెస్టుల్లో నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో వీళ్లను ఎవరు భర్తీ చేస్తారని చర్చలు జరుగుతున్నాయి. ఈ లోటు ఎప్పటికీ పూడ్చలేనిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో రోకో రిటైర్‌మెంట్‌పై స్పందించాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఆట మొదలుపెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ముగించాల్సిందేనని చెప్పాడు. గౌతీ ఇంకా ఏమన్నాడంటే..


ఇదే మంచి చాన్స్!

కెరీర్ అన్నాక ఏదో ఒక రోజు దానికి శుభం కార్డు పడాల్సిందేనని గంభీర్ అన్నాడు. అయితే రిటైర్‌మెంట్ అనేది ప్రతి ఆటగాడి వ్యక్తిగత నిర్ణయమని తెలిపాడు. ఈ విషయంలో ఇతరుల జోక్యం ఉండొద్దన్నాడు. ఈ అంశంలో ప్లేయర్లకు తప్ప వేరే వాళ్లకు ఏ హక్కూ ఉండదని చెప్పుకొచ్చాడు గౌతీ. సెలెక్టర్, కోచ్ లేదా ఎవరైనా కానివ్వండి.. ఒక ఆటగాడికి ఎప్పుడు రిటైర్ అవ్వాలో చెప్పే హక్కు ఎవరికీ లేదన్నాడు. కాబట్టి ఇది ఆటగాళ్ల ఇష్టమని, వాళ్లు సొంతంగా తీసుకునే నిర్ణయం ఇది అని పేర్కొన్నాడు గంభీర్. రిటైర్‌మెంట్ విషయంలో రోహిత్-కోహ్లీ తీసుకున్న డెసిషన్‌కు అంతా మద్దతుగా నిలవాలని కోరాడు. అయితే రోకో వెళ్లిపోవడంతో వారి స్థానాల్లో ఆడేందుకు కుర్రాళ్లకు అద్భుతమైన అవకాశం దొరికిందని.. దీన్ని యువకులు అందిపుచ్చుకోవాలన్నాడు భారత కోచ్. దేశం కోసం ఆడే చాన్స్ దొరికినప్పుడు తాము స్పెషల్ అని నిరూపించుకోవాల్సిన బాధ్యత యువ ఆటగాళ్ల మీద ఉందన్నాడు గంభీర్. అయితే ఇది అంత సులువు కాదని, టీమిండియాకు ఆడుతున్నప్పుడు ఉండే ఒత్తిడిని ఎదుర్కోవడం పెద్ద సవాల్ అని వివరించాడు.


ఫోకస్ దాని మీదే..

రోహిత్-కోహ్లీ రిటైర్‌మెంట్‌పై గంభీర్ స్పందించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వాళ్ల సొంత నిర్ణయమని, ఇందులో ఇతరుల జోక్యం ఉండదంటూ అతడు తేల్చేశాడని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఉన్న పళంగా రిటైర్ అవడం వెనుక టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల ఒత్తిడి ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గౌతీ చెప్పినంత మాత్రాన అతడి పాత్ర లేదని అనుకోవడానికి లేదని కామెంట్స్ చేస్తున్నారు. రోకో వైదొలిగారనే బాధ గంభీర్ మాటల్లో పెద్దగా కనిపించడం లేదని అంటున్నారు. వాళ్ల స్థానాలను భర్తీ చేయడం మీదే ఎక్కువ ఫోకస్ చేశాడని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

కోర్టుకెక్కిన ప్రీతి జింటా

ఆర్సీబీ ఓడితే పరిస్థితి ఏంటి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 05:51 PM