Gambhir On BCCI Policy: కోహ్లీకి గంభీర్ కౌంటర్.. ఇంత మాట అనేశాడేంటి భయ్యా!
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:38 PM
బీసీసీఐ రూల్స్ విషయంలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో విభేదించాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. మనం హాలీడే కోసం రాలేదని, దేశం కోసం ఆడేందుకు వచ్చామంటూ గట్టిగా ఇచ్చిపడేశాడు.

భారత జట్టు ఆటగాళ్లకు ఫుల్ సపోర్ట్‌గా ఉండే హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఓ నిబంధన విషయంలో మాత్రం టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో విభేదించాడు. హాలీడే కోసం రాలేదని.. దేశం కోసం ఆడేందుకు వచ్చామంటూ గట్టిగా ఇచ్చిపడేశాడు. అతడి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతేడాది చివర్లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ దారుణంగా ఓటమిపాలైంది. దీంతో భారత క్రికెట్ బోర్డు ప్లేయర్లతో పాటు స్టాఫ్ విషయంలో సీరియస్ అయింది. కఠిన నిబంధనలను తీసుకొచ్చింది బీసీసీఐ. ఆటగాళ్ల లగేజీ దగ్గర నుంచి వాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించడం వరకు నిబంధనల్ని కఠినతరం చేసింది. దీనిపై అప్పట్లో కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.
కుటుంబం ముఖ్యమే.. కానీ?
విదేశీ పర్యటనల సమయంలో కుటుంబానికి కాకుండా ఎక్కువ టైమ్ జట్టు కోసం కేటాయించాలని ప్లేయర్లకు స్పష్టం చేసింది బీసీసీఐ. దీనిపై అప్పట్లో కోహ్లీ సీరియస్ అయ్యాడు. ఈ రూల్ మీద తాజాగా స్పందించాడు గౌతం గంభీర్. వెటరన్ క్రికెటర్ ఛటేశ్వర్ పుజారాతో ఇంటర్వ్యూలో అతడు తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రతి ఒక్కరికీ కుటుంబాలు చాలా ముఖ్యమని.. అయితే ఇదేమీ హాలీడే కాదన్నాడు. టూర్లకు వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో తక్కువ మంది ఉంటారని.. వాళ్లతో కలసి పనిచేసి దేశం గర్వపడేలా చేయాలన్నాడు గంభీర్.
రూమ్‌లో ఒంటరిగా..
‘ఆటగాళ్లతో కుటుంబాలు ఉండటానికి బీసీసీఐ వ్యతిరేకం కాదు. కానీ ఫ్యామిలీకి కూడా టైమ్ కేటాయించాలి. దేశం కోసం ఆడేందుకు వచ్చినప్పుడు ఫోకస్ మొత్తం ఆట మీదే ఉండాలి. అందరూ అదే లక్ష్యం కోసం ఆడాలి. నా వరకు ఇతర విషయాల కంటే ఆటే ఎక్కువ. ఆ లక్ష్యం మీదే నా దృష్టి ఉంటుంది. ఇక్కడ ప్రతి రోజూ ముఖ్యమే. ఎవ్వరైనా సరే నేర్చుకుంటూ, మెరుగవుతూ ఉండాలి. ఇక్కడ నేను కాదు.. భారత క్రికెటే ముఖ్యం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కాగా, బీసీసీఐ ఫ్యామిలీ పాలసీపై అసహనం వ్యక్తం చేస్తూ కోహ్లీ అప్పట్లో పలు వ్యాఖ్యలు చేశాడు. కుటుంబానికి దూరంగా రూమ్‌లో ఒంటరిగా ఉంచడం సరికాదని, ఈ బాధ ఎవరికీ అర్థం కాదన్నాడు. ఈ నిబంధనల వల్లే అతడు తన టెస్ట్ కెరీర్‌ను త్వరగా ముగించాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో గంభీర్ విరాట్‌కు పూర్తి భిన్నంగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి:
టీమిండియా కొంపముంచిన మిస్టేక్స్
సక్సెస్ సీక్రెట్ చెప్పిన తెలుగోడు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి