Share News

Akash Chopra: ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:04 AM

టీమిండియాలో మూడో స్థానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్రంగా స్పందించాడు. మూడో స్థానంపై ప్రయోగాలు చేయొద్దని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

Akash Chopra: ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా
Ind Vs SA

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్లో మూడో నంబర్‌ బ్యాటింగ్‌ స్థానం ఎంతో కీలకమైంది. జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిని ఆ స్థానంలో ఆడిస్తారు. ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయడం, ముందుకు నడిపించడంలో ఈ స్థానంలో ఆడే బ్యాటర్‌ ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది. అలాంటి స్థానం విషయంలో జట్టు యాజమాన్యం చేస్తున్న ప్రయోగాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) స్పందించాడు. టీమిండియలో వన్‌డౌన్‌పై గందరగోళం నెలకొందని విమర్శించాడు.


‘వాషింగ్టన్ సుందర్‌(Washington Sundar)కు టాప్ ఆర్డర్‌లోనూ బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. అలాగే అతడు అద్భుతమైన బౌలర్ కూడా. హెడ్ కోచ్ గంభీర్(Gautham Gambhir), టీమ్ మేనేజ్‌మెంట్ ప్రతి సిరీస్‌కూ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇలాగే మార్పులు చేస్తారా? వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో ఆడించడంలో తప్పు లేదు. అయితే అతడిని దీర్ఘకాలం ఆ స్థానంలోనే ఆడించాలనే ప్రణాళిక ఉంటే.. సాయి సుదర్శన్(Sai Sudharshan), కరుణ్ నాయర్‌(Karun Nair)తో ఎందుకు ప్రయోగాలు చేసి, సమయం వృథా చేస్తున్నారు?’ అని ఆకాశ్ ప్రశ్నించాడు.


ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు?

‘బ్యాటింగ్‌లో నేర్పు మాత్రమే కాదు ఓర్పును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. క్రీజులో పాతుకుపోయే సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. స్పెషలిస్టులకు అవకాశమివ్వాలి. పరుగులు చేస్తున్నాడు.. ఫామ్‌లో ఉన్నాడని సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఏం లాభం బెంచ్‌కే పరిమితం చేశారు. జట్టు నుంచి తప్పించి అతడికి ఏం మేసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ‘నువ్వు పరుగులు చేస్తున్నావ్. కానీ.. మేం మనసు మార్చుకున్నాం’ అని చెప్పాలనుకుంటున్నారా? ప్రయోగాలు చేయండి.. తప్పు లేదు. కానీ అవి గందరగోళాన్ని సృష్టించొద్దు’ అని ఆకాశ్ చోప్రా సూచించాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 టోర్నీ.. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్

మినీ వేలాన్ని ఆపేయండి: రాబిన్ ఉతప్ప

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 21 , 2025 | 11:08 AM