IPL 2026: మినీ వేలాన్ని ఆపేయండి: రాబిన్ ఉతప్ప
ABN , Publish Date - Nov 21 , 2025 | 07:24 AM
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ మినీ వేలాన్ని ఆపేసి.. ఏడాది పాటు ట్రేడ్ విండో తెరిచే ఉంచాలని సూచించాడు. రెండు నెలలు మాత్రమే ఉన్న ఈ టోర్నీని ఆరు నెలలకు పొడగించాలని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్ జాబితాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లను ట్రేడ్ ద్వారా కూడా ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. కాగా అబుదాబి వేదికగా డిసెంబర్ 16న ఐపీఎల్(IPL 2026) మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఐపీఎల్ టోర్నీని స్టార్టప్ దశకు మించి తీసుకెళ్లడం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్ ఇది. మారుతున్న కాలానికి అనుగుణంగా టోర్నీని మార్చాలి. వేలం ప్రక్రియను నిలిపేసి ఏడాది పాటు ట్రేడ్ విండో తెరిచే ఉంచాలి. వేలాన్ని పక్కన పెట్టి డ్రాఫ్ట్ సిస్టమ్‌ను తీసుకురావాలి. నేను ఐపీఎల్ ఆడుతున్నప్పటి నుంచి ఈ విషయాన్ని చెబుతున్నా. కానీ వారు టీవీ వినోదం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. డ్రాఫ్ట్ విధానం అంతకంటే గొప్పది అవుతుంది. ఇది అభిమానులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. దీన్ని అమలు చేయండి. దాంతో పాటు రెండు నెలల టోర్నీగా మాత్రమే నడుస్తున్న ఈ ఐపీఎల్‌ను.. ఆరు నెలల లీగ్‌గా మార్చాలి. మధ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించాలి. కానీ ఐపీఎల్ అభివృద్ధి చెందాలి’ అని రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు.
ఏంటీ డ్రాఫ్ట్ సిస్టం?
డ్రాఫ్ట్ సిస్టం అంటే ఆటగాళ్లను సమాన పద్ధతిలో జట్లకు కేటాయించడానికి ఉపయోగించే విధానం. అత్యుత్తమ ప్రతిభను కనబర్చే క్రికెటర్లపై ఒక ఫ్రాంచైజీ ఆధిపత్యం ఉండకుండా.. జట్ల బలాబలాల మధ్య సమతుల్యం తీసుకురావడానికి దీన్ని ప్రవేశపెట్టారు. డ్రాఫ్ట్‌లో అర్హత ఉన్న ఆటగాళ్ల సమూహం నుంచి జట్లు వంతుల వారీగా ఎంపిక చేసుకుంటాయి. కాగా ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన రాబిన్ ఉతప్ప 205 మ్యాచ్‌లు ఆడి 4952 పరుగులు చేశాడు. 2014లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో రాబిన్ ఉతప్ప కీలక పాత్ర పోషించాడు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి