Share News

Akash Chopra: ట్రోల్ చేసి క్షమాపణలు చెప్పాడు: ఆకాశ్ చోప్రా

ABN , Publish Date - Nov 21 , 2025 | 10:10 AM

ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మొయిన్ అలీ తనను ట్రోల్ చేశాడని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా వెల్లడించారు. మళ్లీ తానే క్షమాపణలు చెప్పాడని తెలిపాడు.

Akash Chopra: ట్రోల్ చేసి క్షమాపణలు చెప్పాడు: ఆకాశ్ చోప్రా
Akash Chopra

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ మాజీ స్టార్ క్రికెటర్ మొయిన్ అలీపై టీమిండియా మాజీ ప్లేయర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Akash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో మొయిన్ తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేశాడని గుర్తు చేసుకున్నాడు. 2016లో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు తాను చేసిన ఓ విశ్లేషణ తనకు నచ్చలేదని వెల్లడించాడు.


‘అప్పుడు నేను క్రిక్‌ఇన్ఫోలో అనలిస్ట్‌గా పని చేస్తున్నా. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా మొయిన్‌(Moeen Ali)పై ఓ విశ్లేషణ చేశా. అతడు షార్ట్ బాల్‌ను ఎదుర్కోలేడని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు ఫీల్డర్లను వెనక పెట్టి ట్రాప్ చేయొచ్చని చెప్పా. దానికి సంబంధించిన డెమో కూడా చూపించాం. అయితే ఆ సిరీస్‌లో మొయిన్ శతకం బాదాడు. అదే రోజు సాయంత్రం తన సోషల్ మీడియాలో నా కెరీర్ గణాంకాలను పోస్ట్ చేసి నన్ను ట్రోల్ చేశాడు. ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తే పర్లేదు. కానీ నా సహ క్రికెటర్‌ చేయడంతో నేను రిప్లై ఇవ్వాల్సి వచ్చింది. ‘నా విశ్లేషణలో తప్పు ఏమీ లేదు.. నా స్టాట్స్‌పై నీకు అభ్యంతరం ఉంటే ఏం చేస్తాం… కానీ నా పని ఈ విశ్లేషణ చేయడమే’ అని చెప్పాను’ అంటూ ఆ ఘటనను గుర్తు చేసుకున్నాడు.


అనుకున్నట్లే..

ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగానే మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ‘తరువాతి రోజు ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌కు వచ్చాడు. టీమిండియా ముగ్గురు ఫీల్డర్లను డీప్‌లో పెట్టింది. మొదటి నుంచే బౌన్సర్లతో అటాకింగ్ ప్రారంభించారు. మొయిన్‌ ఒక ఫోర్‌ కొట్టి వెంటనే అదే ప్లాన్‌కు చిక్కి ఔటయ్యాడు. నా విశ్లేషణ కరెక్ట్‌ అనిపించింది. అయినా నేను అతని దగ్గరకు వెళ్లి ‘చూశావా’ అని చెప్పలేదు. అయితే కొద్దిసేపటికే మొయిన్‌ నా దగ్గరకి వచ్చి క్షమాపణలు చెప్పాడు.. ‘సారీ.. నేను అలా రియాక్ట్‌ అవ్వకుండా ఉండాల్సింది. నేను చేసింది తప్పే’ అన్నాడు’ అని చోప్రా వివరించాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 టోర్నీ.. కెప్టెన్‌గా ఇషాన్ కిషన్

మినీ వేలాన్ని ఆపేయండి: రాబిన్ ఉతప్ప

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 21 , 2025 | 10:48 AM