Karnataka Office: ఓరి మీ దుంపతెగ.. ఇలా ఉన్నారేంట్రా బాబూ.. జాబ్ నుంచి తీసేశారని ఏం చేశాడంటే..
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:34 PM
కర్ణాటకలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకొచ్చింది. జాబ్ నుంచి తీసేశారనే కోపంతో కంపెనీపై పగ తీర్చుకునేందుకు విచిత్రమైన ప్లాన్ వేశాడు ఓ వ్యక్తి. ఆఫీసు కార్యాలయం ముందు అతడు చేసిన పనికి ఉద్యోగులు, స్థానికులు షాకవుతున్నారు.

లే ఆఫ్‌ల పేరిట ఈ మధ్య జాబ్ పోగొట్టుకుని రోడ్డున పడ్డారు ఎంతోమంది. పెద్ద పెద్ద కంపెనీలే ఆర్థిక మాంద్యం, కంపెనీ ఖర్చులు, నష్టాలు తగ్గించుకోవడం వంటి కారణాలతో హఠాత్తుగా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసేశాయి. ఇదే తరహాలో కర్ణాటకలోని ఓ కంపెనీ 50 శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అకారణంగా జీవనోపాధి పోవడంతో అప్పటికి ఆగ్రహం వ్యక్తం చేసినా తర్వాత చాలామంది వేరే ఉద్యోగం వెతుక్కున్నారు. ఇంకొందరు ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డారు. ఒకరు మాత్రం తన పొట్ట కొట్టిన కంపెనీపై ఎలాగోలా ప్రతీకారం తీర్చుకోవాలని విచిత్రమైన ప్లాన్ వేశాడు. ఉదయాన్నే డ్యూటీకి వచ్చిన ఉద్యోగులు ఆఫీసు కార్యాలయం ముందు అతడు చేసిన పని చూసి హడలిపోయారు. కంపెనీ జాబ్ నుంచి తీసేస్తే మాత్రం ఈ పని చేస్తారా ఎవరైనా.. అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ, ఏం జరిగిందంటే..
కర్ణాటకలోని బళ్లారిలో ఓ వింత కేసు వెలుగులోకొచ్చింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ముందు ఈ ఘటన వెలుగుచూసింది. కార్యాలయం ముందు చేతబడికి సంబంధించిన ఆనవాళ్లు ఉండటం చూసి ఒక్కసారిగా ఆఫీసు సిబ్బంది, స్థానికులు షాక్‌కు గురయ్యారు. నివేదికల ప్రకారం, KMF కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద అనేక విచిత్రమైన వస్తువులు ఉన్నాయి. వీటిలో ఒక నల్ల బొమ్మ, గోర్లు గుచ్చిన పెద్ద గుమ్మడికాయ, కొబ్బరి, నిమ్మ, కుంకుమ, ఎర్రటి వెర్మిలియన్ ఉన్నాయి. వీటితో పాటు తాయెత్తు ఉన్న సంచిలో కట్టిన కొబ్బరికాయ, ఒక మూతపై విచిత్రమైన చిహ్నాలు ఉన్నాయి.
పూజలు చేసిన వారి జాడ లేదు
కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ బ్లాక్ మ్యాజిక్ చేసిన వ్యక్తి కెమెరాకు చిక్కలేదు. సెక్యూరిటీ గార్డులు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. దీంతో సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల కంటబడకుండా రహస్యంగా చేతబడి చేసిందెవరో పోలీసులకు అంతు చిక్కడంలేదు.
ఉద్యోగుల తొలగింపే కారణమా..
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ కారణంతో లేఆఫ్ కోసం జాబితా సిద్ధం చేసి 50 మందిని జాబ్ నుంచి తీసేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగాల తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసంతృప్త ఉద్యోగుల్లో కొందరికి చేతబడిపై నమ్మకం ఉన్నట్లు సమాచారం. కంపెనీ ఉద్యోగులను తొలగించిన తర్వాతే ఈ సంఘటన జరగడంతో ఉద్యోగులే ఇందుకు కారణం అయ్యుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
రాజకీయ లబ్దిపై ఊహాగానాలు..
రాజకీయ లబ్ది పొందేందుకు ఈ చేతబడి క్రతువు చేసి ఉండొచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లభించలేదు. ఈ ఘటన వెనక ఎవరు ఉన్నారో కనిపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను ప్రజలు విశ్వసించడంపై స్థానికుల్లో చర్చ మొదలైంది.