Dhirubhai Ambani: రూ.300 జీతం నుంచి వేల కోట్ల ఆదాయం.. కొడుకులకు ధీరూభాయ్ అంబానీ ఎంత ఆస్తిని వదిలివెళ్లాడో తెలుసా..
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:29 PM
దేశంలోనే అతి పెద్దదైన రిలయన్స్ ఇంస్ట్రీస్‌ను స్థాపించి, తన కొడుకుల ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాటలు వేశారు ధీరూభాయ్ అంబానీ. అయితే ఆయన చనిపోయే నాటికి తన కొడుకులకు ఎంత ఆస్తిని వదిలివెళ్లాడు, ఆయన మరణం తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

జీరో టూ హీరో.. అనే మాటకు కొందరి జీవితం నిలువుటద్దంలా నిలుస్తుంటుంది. అట్టడుగు స్థాయి నుంచి ఎంతో కష్టపడి చివరికి ఎవరికీ అందనంత స్థాయిలోకి వెళ్తుంటారు. ఇలాంటి వారిలో ధీరూభాయ్ అంబానీ ముందు వరుసలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. పెట్రోల్ బంకులో రూ.300ల జీతానికి పనిచేసిన ఆయన.. చివరకు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వేల కోట్ల సమ్రాజ్రాన్ని సృష్టించాడు. దేశంలోనే అతి పెద్దదైన రిలయన్స్ ఇంస్ట్రీస్‌ను స్థాపించి, తన కొడుకుల ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాటలు వేశారు. అయితే ధీరూభాయ్ అంబానీ చనిపోయే నాటికి తన కొడుకులకు ఎంత ఆస్తిని వదిలివెళ్లాడు, ఆయన మరణం తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ధీరూభాయ్ అంబానీ (Dhirubhai Ambani) గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లాలో చోర్వాడ్ అనే గ్రామంలో 1932 డిసెంబర్ 28న జన్మించారు. నలుగురు పిల్లల్లో ధీరూభాయ్ ఒకరు కాగా, ఈయన తండ్రి ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. అయినా వారి కుటుంబం చాలీచాలని జీతంతో తీవ్ర ఇబ్బందులు పడేది. వారి ఆర్థిక పరిస్థితులను చిన్న తనంలోనే అర్థం చేసుకున్న ధీరూభాయ్.. 17 ఏళ్ల వయసులో తన సోదరుడితో కలిసి యెమెన్ వెళ్లాడు. ఆ దేశంలో పెట్రలో బంకులో రూ.300ల జీతానికి పనికి కుదిరాడు. అప్పటి నుంచి ఎంతో నిజాయితీ, నిబద్ధతతో పని చేసి అనతికాలంలోనే ఆ బంకులో మేనేజర్ స్థాయికి చేరాడు. ఇలా కొన్నేళ్ల పాటు పని చేసి డబ్బులు కూడబెట్టాడు. ఆ తర్వాత 1954లో భారత్ తిరిగి వచ్చాడు.
భారతదేశానికి తిరిగి వచ్చిన ధీరూభాయ్ అంబానీ.. ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. వస్త్ర వ్యాపారంతో మొదలైన ఆయన ప్రస్తానం.. క్రమంగా పెట్రోకెమికల్స్, టెలికాం తదితర అనేక పరిశ్రమలల్లోకి విస్తరించింది. చివరకు రిలయన్స్‌ను ఓ సామ్రాజ్యంలా విస్తరింపజేశాడు.
రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్‌ను స్థాపించి..
రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ (Reliance Commercial Corporation) పేరుతో 1966లో సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ చివరికి భారతదేశపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)గా ఎదిగింది. అలాగే రిలయన్స్ టెక్ట్సైల్స్ స్థాపించి, సింథటిక్ దుస్తులపై దృష్టి సారించాడు. భారతదేశ మూలధన మార్కెట్లను రూపొందించడంలో ధీరూభాయ్ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన ప్రయత్నాలు మధ్యతరగతి కుటుంబాల్లో ఈక్విటీ పెట్టుబడిని ప్రాచుర్యం పొందడంలో సహాయపడ్డాయి.
వస్త్ర వ్యాపారంగా ప్రారంభమై..
వస్త్ర వ్యాపారంగా ప్రారంభమైన రిలయన్స్ సంస్థ.. అనతికాలంలోనే పెట్రోకెమికల్స్, శుద్ధి, చమురు, గ్యాస్, టెలికాం తదితర రంగాలకు విస్తరించింది. ధీరూభాయ్ వ్యూహాత్మక ఆలోచనలు, మూలధనాన్ని సేకరించే సామర్థ్యం, దార్శనికత.. ఆయన్ను భారత వ్యాపార చరిత్రలో విప్లవాత్మక వ్యక్తిగా నిలిపాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎంత సంపదను వదిలి వెళ్లాడంటే..
అనతి కాలంలోనే సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరుగా మారిన ధీరూభాయ్ అంబానీ 2002లో మరణించారు. ఫోర్బ్స్ ప్రకారం.. ఆయన మరణించే సమయానికి ప్రపంచంలోనే 138 ధనవండిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన వ్యక్తిగత నికర విలువ USD 2.9 బిలియన్లుగా (రూ. 24,000 కోట్లు) ఉంది. అలాగే రిలయన్స్ విలువు సుమారు రూ.60,000 కోట్లుగా ఉంది.
ధీరూభాయ్ మరణానంతరం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ను ముఖేష్ అంబానీ (Mukesh Ambani) తీసుకున్నారు. ఇందులో చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, టెలికాం తదితరాలు ఉన్నాయి. అలాగే అనిల్ అంబానీకి (Anil Ambani) రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ తదితర సంస్థలు దక్కాయి. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ.17.5 లక్షల కోట్లకు పైగా చేరింది. అలాగే ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరుగా ఉన్న విషయం తెలిసిందే. ఈయన నికర విలువ 9,790 కోట్ల USDగా ఉంది. ఇక అనిల్ అంబానీ తన అన్న కంటే చాలా వెనుబడి ఉన్నాడు. ఈయన నికర విలువ రూ. 2500 కోట్ల కంటే ఎక్కువగా ఉంది.