Share News

Advaitam Dance of Yoga: డాలస్‌లో ఆకట్టుకున్న ‘అద్వైతం - డాన్స్ ఆఫ్ యోగా’ కూచిపూడి

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:02 PM

డాలస్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్యర్యంలో ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా కూచిపూడి నృత్యం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి అతిథులకు ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.

Advaitam Dance of Yoga: డాలస్‌లో ఆకట్టుకున్న ‘అద్వైతం - డాన్స్ ఆఫ్ యోగా’ కూచిపూడి

ఇంటర్నెట్ డెస్క్: డాలస్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్యర్యంలో (Mahatma Gandhi Memorial of North Texas) ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో ‘అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా’ (Advaitam Dance of Yoga) కూచిపూడి నృత్యం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి అతిథులకు ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. కూచిపూడి నాట్య రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన నాట్యగురు, శ్రీకాకుళం జిల్లాలో నెలకొని ఉన్న ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ డైరెక్టర్ అయిన స్వాతి సోమనాథ్ తన శిష్యులైన కొర్రా బలరాం, నిమ్మల అంజలిలు చేసిన వివిధ నృత్య ప్రదర్శనలు రెండు గంటలపాటు ఆహుతులను అలరించాయని వెల్లడించారు.


శ్రీకాకుళం జిల్లాలో ప్రపచంలోనే తొలి ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’: స్వాతి సోమనాథ్

అనంతరం స్వాతి సోమనాథ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనల మేరకు శ్రీకాకుళం జిల్లాలో 11 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొల్పిన ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ ప్రపచంలోనే తొలి కూచిపూడి గురుకులమని, వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్ధాసక్తులతో నాట్యం నేర్చుకుంటూ కూచిపూడి నాట్యంలో డిగ్రీలు సంపాదించుకుని, దేశ విదేశాల్లో తమ ప్రతిభా పాటవాలను చూపుతున్నారని, ఇటీవల డెట్రాయిట్‌లో జరిగిన తానా మహా సభలకు ఆహ్వానం అందుకుని తొలిసారి అమెరికాలో అడుగుపెట్టిన పిల్లలకు డాలస్ నగరంలో డా. ప్రసాద్ తోటకూర, వారి బృందం చూపిన ఆదరణ ఎన్నటికీ మరువలేనిదని నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.


రెండు గంటల పాటు సాగిన నాట్యవిభావరి

రెండు గంటల పాటు కన్నుల పండుగగా సాగిన నాట్యవిభావరిలో ‘శ్రీ గణనాధం’- త్యాగరాజ కృతి కనకాంగి రాగం, ఆది తాళంలో ఉన్న వినాయకుడి స్తుతితో ప్రారంభమైంది. ‘ఒక పరి ఒక పరి’ – ఖరహర ప్రియ రాగం, ఆది తాళంలో అన్నమాచార్య కీర్తన శ్రీ వేంకటేశ్వర స్వామి అందాన్ని వర్ణిస్తుంది. ముదురు రంగులో అలవేలుమంగ సరసమైన ఛాయతో మెరుపుల పరంపరతో ఆలింగనం చేయబడిన చీకటిమేఘంతో పోల్చబడింది. ‘క్షీర సాగర శయన’ – దేవ గాంధారి రాగం, ఆది తాళాల్లో ఉన్న ఈ త్యాగరాజ కృతి - గజేంద్ర మోక్షం, ద్రౌపది వస్త్రాపహరణం అంశాల్లో చక్కగా చూపబడింది. ‘అద్వైతం - యోగా నృత్యం’ - ప్రపంచ శాస్త్రీయ నృత్యాల చరిత్రలో మొదటిసారిగా యోగా, భారతీయ శాస్త్రీయసంగీతం ఏడు స్వరాలు, ఆ స్వర చిహ్నాల కలయిక ఈ అంశంలో వినూత్నంగా చూపించారు. మానవ శరీరంలో మూలాధారంతో ప్రారంభమై సహస్రారంతో ముగుస్తుంది. 7 శక్తి కేంద్రాలు నాట్యశాస్త్రం వివిధ నృత్య భంగిమలతో చూపించారు.

Advaitam-Dance-3.jpg


మంత్రముగ్ధులని చేసిన కూచిపూడి నృత్యహేల

‘తెలుగు కవన నర్తనం’ - తెలుగు భాషా సాహిత్యం, కవిత్వం, సంగీతానికి ముఖ్యమైనది. త్యాగరాజస్వామి కృతి ‘ఎందరో మహానుభావులు’, ‘ఎంకి నాయుడు బావ’ యుగళగీతం, అన్నమయ్య 'బ్రహ్మం ఒక్కటే’, విశ్వనాథ వారి ‘కిన్నెరసాని’, మంగళంపల్లి బాలమురళి ‘థిల్లానాతో’ మొదలై భక్త రామదాసు పాటలతో తెలుగుసాహిత్యంలోని వాగ్గేయకారులకు, కవులకు నివాళితో గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలు చేసిన కూచిపూడి నృత్యహేల అందర్నీ మంత్రముగ్ధులని చేసింది.

Advaitam-Dance-4.jpg


స్వాతి సోమనాథ్ కృషి అమోఘం: పాతూరి నాగభూషణం

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ... మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, సాహిత్యం, కళలను నిరంతరం ప్రోత్సహిస్తున్న డా. తోటకూర ప్రసాద్ నేతృత్వంలో ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసినందుకు వారిని, మహాత్మాగాంధీ మెమోరియల్, తానా, ఆటా, టిపాడ్, ఇండియా అసోసియేషన్, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ సభ్యులను ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న పిల్లలను చేరదీసి కూచిపూడి నాట్యంలో ఎంతో అకుంఠిత దీక్షతో ఆణిముత్యాలను తయారుచేస్తున్న స్వాతి సోమనాథ్ కృషి అమోఘమని ప్రశంసించారు.

Advaitam-Dance.jpg


స్వాతి సోమనాథ్‌ కూచిపూడి నాట్యాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తారు: కేవీ సత్యనారాయణ

ప్రముఖ కూచిపూడి నాట్యగురు కళారత్న కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వాతి సోమనాథ్‌తో.. చిరకాల పరిచయమని, ఇద్దరం కలసి కొన్ని ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశామని, ఈ రోజు డాలస్‌లో కలుసుకోవడం ఆనందంగా ఉందని, కూచిపూడి నాట్యాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఆమె కృషి సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.


గౌరవ అతిథులుగా విచ్చేసిన బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కేవీ సత్యనారాయణలు వివిధ సంఘాల నాయకులతో కలసి నాట్య గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిని ఘనంగా సన్మానించారు.

Advaitam-Dance-1.jpg


మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంఘ నాయకులు – డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వల, తయాబ్ కుండావాల, బీఎన్ రావు, మహేంద్ర రావు, మురళి వెన్నం, అనంత్ మల్లవరపుతో పాటు ఐఏఎన్టీ నాయకులు షబ్నం మాడ్గిల్, సుష్మా మల్హోత్రా, డా. జేపీ, ముర్తుజా, ఆటా, టీపాడ్ నాయకులు రఘువీర్ బండారు, వేణు భాగ్యనగర్, శారదా సింగిరెడ్డి, పాండు పాల్వాయి, సత్య పెర్కారి, తానా నాయకులు లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, టాన్ టెక్స్ నాయకులు చంద్ర పొట్టిపాటి, సుబ్బు జొన్నలగడ్డ, భీమ పెంట, ఆనందమూర్తి, లలిత మూర్తి కూచిభోట్ల, చిన సత్యం వీర్నపు, నరసింహా రెడ్డి ఊరిమిండి, పుర ప్రముఖులు లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, చంద్రహాస్ మద్దుకూరి, జాకీర్ హుస్సేన్, మడిసెట్టి గోపాల్, అత్తలూరి విజయలక్ష్మి, భార్గవి పేరి, నాగరాజు నలజుల, పూర్ణా నెహ్రు మొదలైన వారు హాజరై ఈ కార్యక్రమాన్ని ఆసాంతం ఆస్వాదించారు.

Advaitam Dance of Yoga Dallas


బీఎన్ రావు తన వందన సమర్పణలో ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన కాకతీయ హాల్ నిర్వాహకులకు, డీఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి, ఫన్ ఏషియా, సురభి రేడియో యాజమాన్యాలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు, హాజరైన కళాపోషకులకు, అద్భుతమైన నాట్య ప్రదర్శనలు చేసిన కళాకారులు నాట్యగురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలికి, గౌరవ అతిథులుగా విచ్చేసిన బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కేవీ సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు చదవండి:

నాట్స్ సంబరాలు..టాంపాలో ‘పుష్ప’

టాంపాలో.. నాట్స్ సంబరాలు ప్రారంభం

Read Latest and NRI News

Updated Date - Jul 15 , 2025 | 01:25 PM