Share News

Rajinikanth: ఎవరికోసం ‘రజనీ’ వ్యూహం.. బీజేపీ కూటమి బలోపేతానికి తలైవా యత్నం

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:00 AM

రజనీకాంత్‌... తమిళనాట సంచలనాలకు మారుపేరు. అయితే.. మరో ఏడాదిన్నర కాలంలో జనగబోయే ఎన్నికల్లో ఆయన ఎవరికి మద్దతు ప్రకటిస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన మద్దతు కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

Rajinikanth: ఎవరికోసం ‘రజనీ’ వ్యూహం.. బీజేపీ కూటమి బలోపేతానికి తలైవా యత్నం

- అందుకే జయ నివాసానికి వెళ్లారా..

- ఈపీఎస్‌ వ్యతిరేకులందరినీ ఏకతాటిపైకి తేనున్నారా..

- రాజకీయవర్గాల్లో సర్వత్రా చర్చ

చెన్నై: తన సన్నిహితుల కోరిక మేరకు రాష్ట్రంలో బీజేపీ(BJP) కూటమి బలోపేతానికి రజనీ పూనుకున్నారా.. అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వ్యతిరేకులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు నడుం బిగించారా.. ఇందులో భాగంగానే రజనీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి వెళ్లారా?.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ క్రియాశీలకంగా వ్యవహరించనున్నారా.. అవుననే అంటున్నాయి ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు.

ఈ వార్తను కూడా చదవండి: Fruits: శివరాత్రి ఎఫెక్ట్‌.. పెరిగిన పండ్ల ధరలు


జయ జయంతి సందర్భంగా సోమవారం పోయెస్ గార్డెన్‌(Poes Garden)లో వున్న ‘వేదనివాస్’కు వెళ్లిన రజనీకాంత్‌(Rajinikanth) మాజీముఖ్యమంత్రి జయలలిత చిత్రపటానికి నివాళులర్పించారు. అంతేగాక జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌ కుటుంబాలతోనూ సన్నిహితంగా మెలిగారు. ఆ కొద్దిసేపటికే అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం(ఓపీఎస్‌) కుమారుడు, తేని మాజీ ఎంపీ రవీంద్రనాధ్‌ కుమార్‌ కూడా జయ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకేలో విప్లవం మొదలైందని, త్వరలో ఆయా నేతలు, కార్యకర్తలంతా తిరుగుబాటు చేస్తారని వ్యాఖ్యానించారు. రజనీ వేదనివాస్‌ నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఇదంతా జరగడం గమనార్హం. నిజానికి రజనీ జయకు నివాళులర్పించాలని భావిస్తే, ఆమె స్మారకమందిరానికి వెళ్లొచ్చు. అలా కాకుండా 29 ఏళ్ల తరువాత ఆయన జయ నివాసానికి రావడం, ఆ తరువాత కొద్దిసేపటికే ఓపీఎస్‌ కుమారుడు రావడం యాదృచ్ఛికం కాదని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


ఒకే గొడుగు కిందకు బహిష్కృత నేతలు...

తమను ఎలాగోలా పార్టీలో చేర్చుకోవాలంటూ బహిష్కృత నేతలైన మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్‌, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, ఇదే పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన ప్రస్తుత ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’ నేత టీటీవీ దినకరన్‌ రకరకాలుగా ఈపీఎ్‌సకు రాయబారాలు పంపుతున్నారు. అయితే ఇందుకు ఆయన ససేమిరా అనడంతో, ఎలాగైనా ఈపీఎస్‏ను దెబ్బ కొట్టాలని వ్యూహరచన చేస్తున్నారు. అంతేగాక తన మేనత్త వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని భావించి, అప్పట్లో ఆస్తులతో సంతృప్తి పడి, ఇప్పుడు మళ్లీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ఉవ్విళ్లూరుతున్న జయ మేనకోడలు దీప కూడా ఈపీఎస్‌ వ్యవహారశైలిపై రగిలిపోతున్నారు.

nani1.jpg

జయ ఆస్తులన్నీ తీసుకుని మిన్నకుండిపోవాలని, పార్టీ జోలికి రావద్దంటూ దీప, దీపక్‌లకు అప్పట్లో ముఖ్యమంత్రిగా వున్న ఈపీఎస్‌ నచ్చజెప్పారు. కోర్టు ఆధీనంలో వున్నవి మినహా, మిగిలిన ఆస్తులన్నీ తమకు వస్తున్నాయన్న సంతోషంలో ఈపీఎస్‌ మాటలకు కట్టుబడిన దీప.. ఇప్పుడు రాజకీయ అరంగేట్రం కోసం తహతహలాడుతున్నారు. అయితే తగిన వేదిక కోసం ఆమె వేచిచూస్తున్నారు. ఇప్పుడు ఆమె కూడా ఓపీఎస్‌, శశికళ వర్గంతో చేతులు కలిపే సూచనలు కనిపిస్తున్నాయి.


క్రియాశీలకంగా సూపర్‌స్టార్‌...

తమిళనాట డీఎంకేను అడ్డుకోవాలంటే అన్నాడీఎంకేతో చేతులు కలపడం మినహా మరో మార్గం లేదని భావిస్తున్న బీజేపీ.. తమకు అత్యంత మిత్రుడైన రజనీకాంత్‌ను రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఈపీఎ్‌సకు సర్దిచెప్పి, తమతో చేతులు కలిపేలా చేయడం, లేదా అన్నాడీఎంకే అసమ్మతి వర్గాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు ఇతర పార్టీలను తమ కూటమిలో చేరేందుకు సహకరించాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు రజనీని కోరినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే రజనీకాంత్‌ గతానికి భిన్నంగా జయ నివాసానికి వెళ్లి మరీ అంజలి ఘటించడమని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రజనీ నివాసానికి వెళ్లి ఓపీఎస్‌ భేటీ అయ్యారు. ఇప్పుడుజయ నివాసంలో వుంటున్న ఆమె మేనకోడలు, మేనల్లుడితో రజనీకాంత్‌ భేటీ అయ్యారు.


nani1.2.jpg

ఈ సమయంలో జయ నమ్మినబంటు, ఓపీఎస్‌ వర్గీయుడైన పుహళేంది కూడా వుండడం గమనార్హం. ఈ సందర్భంగా తన నివాసానికి విందుకు రావాలని దీపక్‌, దీపను రజనీ ఆహ్వానించగా, అందుకు వారు అంగీకరించినట్లు సమాచారం. ఇక రజనీ కుటుంబానికి శశికళ సన్నిహితురాలే. వీరందరినీ ఒకేతాటిపైకి తీసుకురావడంలో భాగంగానే రజనీకాంత్‌ వారితో సమావేశమవుతున్నారని తెలుస్తోంది. అంతేగాక ‘నామ్‌ తమిళర్‌ కట్చి’ అధినేత సీమాన్‌ కూడా గతంలో రజనీతో భేటీ అయ్యారు. ఆ తరువాత ఆయన స్వరం మారింది. బీజేపీ పట్ల సానుకూలత వ్యవహరిస్తున్నారు. అది రజనీ ప్రభావమేనని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఒకవేళ ఈపీఎస్‌ బీజేపీతో కూటమికి అంగీకరించనిపక్షంలో వీరంతా ఒకేతాటిపైకొచ్చి బీజేపీతో చేతులు కలుపుతారని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రజనీకాంత్‌కు డీఎంకే నేతలతో స్నేహ సంబంధాలున్నప్పటికీ.. బీజేపీ నేతలతో అంతకుమించిన సాన్నిహిత్యముందని, అందుకే ఆయన వారికి పరోక్ష సా యం అందిస్తున్నారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.


మరోపక్క బీజేపీ..

అసెంబ్లీ ఎన్నికల్లో తమతో చేతులు కలపాల్సిందేనంటూ ఈపీఎస్‏పై రకరకాలుగా బీజేపీ ఒత్తిడి చేస్తోంది. నయానోభయాన్నో ఆయన్ని తమ దారిలోకి తెచ్చుకునేందుకు చేయాల్సిందంతా చేసేస్తోంది. అదే సమయంలో బహిష్కృత నేలందరినీ అన్నాడీఎంకేలోకి చేర్చుకుని, డీఎంకేపై పోరాడాలని ఈపీఎస్‏కు సూచిస్తోంది. బీజేపీతో చేతులు కలిపేందుకు సానుకూలంగా వున్న ఈపీఎస్‌.. బహిష్కృత నేతల్ని చేర్చుకునేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్‌?

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2025 | 11:00 AM