Mohan Bhagwat: ఎందరో త్యాగధనుల కలలు నేటితో సాకారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్
ABN , Publish Date - Nov 25 , 2025 | 02:56 PM
సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక అని మోహన్ భాగవత్ అన్నారు. మన పూర్వీకులు మనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇదని పేర్కొన్నారు.
అయోధ్య: రామాలయ నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి ఆత్మలు ఈరోజు సంతోషంగా ఉంటాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) అన్నారు. అయోధ్యలో బాలరాముడి ఆలయ శిఖరంపై ప్రధానమంత్రి మోదీతో కలిసి కాషాయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఈరోజు ఎంతో శుభదినమని, ఈ క్షణాల కోసం, రామాలయ నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి ఆత్మలకు నేటితో శాంతి చేకూరిందని అన్నారు.
'మహంత్ రాజచంద్ర దాస్ మహరాజ్, దాల్మియా (వీహెచ్‌పీ సీనియర్ నేత), అశోక్ (అశోక్ సింఘాల్) సహా అనేక మంది సాధువులు, విద్యార్థులు, అన్నిరంగాలకు చెందిన ప్రజలు ప్రాణత్యాగాలు చేశారు. ఆలయ నిర్మాణం కోసం వారు కన్న కలలు నేటికి ఫలించాయి' అని మోహన్ భాగవత్ అన్నారు. ఈరోజుతో ఆలయ శాస్త్రీయ ప్రక్రియ పూర్తయిందని, ధ్వజారోహణ నిర్వహించుకున్నామని పేర్కొన్నారు.
500 ఏళ్ల నిరీక్షణ
రామాలయ నిర్మాణం కోసం 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాషాయ జెండా, భగవధ్వజం, ధర్మధ్వజం ఈరోజు ఆలయ శిఖరంపై ఆవిష్కృతమైందని మోహన్ భాగవత్ అన్నారు. హిందువులు తమ సత్వగుణాన్ని 500 ఏళ్లుగా చాటుకుంటూ వచ్చారని, ఎట్టకేలకు రామ్‌లల్లా మందిర నిర్మాణం జరిగి బాలరాముడు మన కళ్లముందు ఉన్నారని అన్నారు. సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక అని పేర్కొన్నారు. మన పూర్వీకులు మనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇదని అన్నారు. ఈదేశంలో పుట్టిన వారంతా మన పెద్దసోదరులని, ఎన్నో అంచనాలతో ప్రపంచం మనవైపు చూస్తోందని, వాటిని సాకారం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. రామాలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ
అత్యంత వైభవంగా కాషాయ ధ్వజారోహణం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.