Congress MP: చెన్నై మినహా ఇతర నగరాలకు మెట్రోరైలు సర్వీసులు అవసరమా..
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:48 PM
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సంచలన కామెంట్స్ చేశారు. చెన్నై మినహా ఇతర నగరాలకు మెట్రోరైలు సర్వీసులు అవసరమా.. అంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. ఆయన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
- కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం
చెన్నై: రాజధాని నగరం చెన్నై మినహా రాష్ట్రంలోని ఇతర నగరాలకు మెట్రోరైలు అవసరమా? అని రాష్ట్ర ప్రభుత్వం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, తనకు సంబంధించినంతవరకూ ఇతర నగరాలలో మెట్రోరైలు సర్వీసులు అనవసరమేనని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం(Karti Chidambaram) అన్నారు. శివగంగ వద్ద సోమవారం జరిగిన ఓ వివాహ వేడుకలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ బిహార్‌లో నితీష్ కుమార్ ఎంతకాలం ఆ రాష్ట్రానికి సీఎంగా ఉంటారో చెప్పలేమని, కేంద్రంలోని బీజేపీ చేతుల్లోనే ఆ సీఎం భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పారు. ఇండోర్, ఆగ్రా నగరాల్లోని మెట్రోరైలు సేవలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయని, అలాంటి పరిస్థితులు తమిళనాట రాకూడదని, కనుకనే తాను చెన్నై మినహా ఇతర నగరాలలో మెట్రోరైలు సర్వీసులు అనవసరమేనని కార్తీ చిదంబరం వివరణ ఇచ్చారు.

5 నెలల వరకు మోదీకి దక్షిణాది వంటకాలే ఇష్టం..
ప్రధాని నరేంద్రమోదీ రాబోవు ఐదు నెలల వరకు కేరళ, తమిళనాడు, అసోం, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి వంటకాలే ఆరగించనున్నారని, తమిళ భాష, తమిళ సంస్కృతి గురించి ప్రతి సభలోనూ ఎలుగెత్తి చాటుతారని కార్తీ చిదంబరం యెద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరుమాసాలే ఉండటంతో మోదీ ఐదు నెలల దాకా దక్షిణభారత ప్రజల సంస్కృతిని గుర్తుకు తెచ్చే దుస్తులనే ధరిస్తారని, తమిళనాడుకు వస్తే ధోవతి, అంగవస్త్రం ధరించి తమిళులపై ప్రేమాభిమానాలను చాటుకుంటారని ఛలోక్తి విసిరారు.

ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత
అది బూటకపు ఎన్‌కౌంటర్: ఈశ్వరయ్య
Read Latest Telangana News and National News