Share News

Kashmir: పచ్చని కొండల్లో నెత్తుటేర్లు

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:35 AM

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. విదేశీయులు, భారతీయ పర్యాటకులు లక్ష్యంగా ఉగ్రవాదులు మతం అడిగి కాల్పులకు తెగబడ్డారు.

Kashmir: పచ్చని కొండల్లో నెత్తుటేర్లు

కశ్మీరు లోయలో ఉగ్రవాదుల నరమేధం.. పర్యాటకులపై కాల్పులు

26 మంది దుర్మరణం.. 20 మందికి తీవ్ర గాయాలు

  • మృతుల్లో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు

  • హైదరాబాద్‌కు చెందిన మనీశ్‌ రంజన్‌ మృతి

  • మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్‌లో దారుణ ఘటన

  • సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు

  • పర్యాటకుల పేర్లు అడిగి మరీ కాల్పులు

  • మైదానం కావడంతో తప్పించుకోవడానికీ వీల్లేక తుపాకీ గుళ్లకు బలైన పర్యాటకులు

  • సమాచారం తెలియగానే రంగంలోకి జవాన్లు

  • హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రుల తరలింపు

  • సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్‌

  • ఉగ్రదాడి తమ పనేనన్న టీఆర్‌ఎఫ్‌.. ఇది లష్కరే తాయిబా నుంచి ఉద్భవించిన ఉగ్ర సంస్థ

  • కాల్పులకు తెగబడిన వారు జంతువులు: ఒమర్‌

  • హుటాహుటిన శ్రీనగర్‌ చేరుకున్న అమిత్‌ షా

  • గవర్నర్‌, సీఎం, ఉన్నతాధికారులతో సమీక్ష

పహల్గాం/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: కశ్మీరు లోయలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్‌ జిల్లాలోని పహల్గాంలో మంగళవారం పచ్చికబయళ్లలో తిరుగుతూ ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న పర్యాటకులపై హఠాత్తుగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసారన్‌ ప్రాంతంలోని కొండల మధ్యనున్న మైదాన ప్రాంతంలో పర్యటిస్తున్న వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారించారు. ముష్కరుల దాడిలో 26 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. మృతుల్లో ఇద్దరు విదేశీయులు (ఇజ్రాయెల్‌, ఇటలీ దేశస్థులు), ఇద్దరు స్థానికులు, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


sdfsf.jpg

మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసారన్‌ ప్రాంతంలో ఉల్లాసంగా తిరుగుతున్న 40 మందికి పైగా పర్యాటకులను సమీప అడవిలో నుంచి వచ్చిన ఉగ్రవాదులు చుట్టుముట్టారు. లోయ అందాలను ఆస్వాదిస్తున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా.. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. తమ వారిని కాపాడాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండడంతో బాధితులను తరలించడం కష్టమైంది. బైసారన్‌లో కాల్పుల శబ్ధం వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ల ద్వారా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్లు సమాచారం. తొలుత మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ.. తర్వాత 26కి చేరినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


ddsffgv.jpg

దాదాపు ఐదుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ‘‘నా భర్త తలలోకి తుపాకీ గుండు దూసుకెళ్లింది. మరో ఏడుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు’’ అని ఓ మహిళ పీటీఐ వార్తా సంస్థకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి, కాపాడాలని వేడుకున్నారు. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగానే భయంతో పరుగులు తీసినప్పటికీ.. పెద్ద మైదాన ప్రాంతం కావడంతో తప్పించుకోవడానికి దారిలేకపోయిందని మరో మహిళ చెప్పారు. ఉగ్రవాదులు పేరు అడిగి మరీ కాల్చి చంపారని మరో మహిళ వెల్లడించారు. బైసారన్‌లో ఉగ్రదాడి జరిగిన సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారు. దాడిలో మరణించిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులను పటిష్ఠ భద్రత నడుమ పహల్గాం క్లబ్‌కు తరలించారు. అనంతనాగ్‌ జిల్లా యంత్రాంగం, పోలీసులు, అంబులెన్సులను ఘటనా స్థలానికి రప్పించారు. సైనికులు, సీఆర్పీఎఫ్‌, స్థానిక పోలీసులు బైసారన్‌ చేరుకున్నారు. పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులను మట్టుబెట్టేందుకు సమీప అటవీ ప్రాంతాన్ని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. పెద్దఎత్తున ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను చేపట్టాయి. ఉగ్రదాడికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు గాను అనంతనాగ్‌, శ్రీనగర్‌లో అత్యవసర కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఓ వైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భారత పర్యటనలో ఉండగా మరోవైపు ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు వెళ్లిన సమయంలో కశ్మీరులో పర్యాటకులపై ఉగ్రమూకలు దాడులకు పాల్పడడం గమనార్హం.


హైదరాబాద్‌ వాసి మృతి

ఉగ్రదాడిలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మృతి చెందారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఉద్యోగి మనీశ్‌ రంజన్‌ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. బైసారన్‌ పర్యటనలో ఉండగా.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత నౌకాదళ అధికారి లెఫ్టినెంట్‌ వినయ్‌ నర్వాల్‌(26) కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. హరియాణాకు చెందిన వినయ్‌కు కోచిలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ నెల 16న ఆయనకు వివాహమైనట్లు అధికారులు చెప్పారు. కశ్మీరు పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రదాడిలో మరణించారు.

  • ఈ ఉగ్రదాడి తమ పనేనని ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ సంస్థ ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా నుంచి టీఆర్‌ఎఫ్‌ ఉద్భవించింది. జమ్మూకశ్మీరులో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత ఇది పుట్టుకొచ్చింది. లష్కరేకు చెందిన సాజిద్‌ జట్‌, సజ్జద్‌ గుల్‌, సలీం రెహ్మానీ టీఆర్‌ఎ్‌ఫకు నాయకత్వం వహిస్తున్నారు. 2023 జనవరిలో కేంద్ర హోం శాఖ ఈ సంస్థపై నిషేధం విధించింది.


dsdsxz.jpg

శ్రీనగర్‌ చేరుకున్న అమిత్‌ షా.. అధికారులతో సమీక్ష

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం రాత్రికి శ్రీనగర్‌ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, సీఎం ఒమర్‌ అబ్దుల్లా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, నిఘా విభాగం డైరెక్టర్‌ తపన్‌ డేకాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీరు డీజీపీ నళిన్‌ ప్రభాత్‌ పహల్గాం ఉగ్ర దాడి వివరాలను తెలియజేశారు. పహల్గాంలో పరిస్థితిపై ఉన్నతాధికారులతో షా సమీక్షించారు. బుధవారం ఆయన ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.


dsdfd.jpg

వాళ్లు జంతువులు: జమ్మూకశ్మీరు సీఎం ఒమర్‌

బైసారన్‌లో ఉగ్రదాడి ఘటన తెలిసి షాక్‌కు గురైనట్లు జమ్మూకశ్మీరు సీఎం ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. పర్యాటకులపై కాల్పులకు తెగబడడం అత్యంత హేయమైన చర్య అని, వారు జంతువులని పేర్కొన్నారు. ఈ దాడిని ఖండించడానికి ఇంతకంటే మాటలు రావడం లేదన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల సంఖ్య పెరుగుతోందని, ఆ వివరాలను ఇప్పుడే చెప్పలేమని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీరులో పౌరులపై నేరుగా జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడి ఇదేనన్నారు.


అమర్‌నాథ్‌ యాత్ర వేళ..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానున్న వేళ.. ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం. 38 రోజుల పాటు కొనసాగే అమర్‌నాథ్‌ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. లక్షలాది మంది యాత్రికులు రెండు మార్గాల్లో ఇక్కడకు చేరుకుంటారు. అనంతనాగ్‌ జిల్లాలోని పహల్గాం మార్గంలోనే యాత్ర 48 కి.మీ. మేర ఉంది. 14 కి.మీ. మార్గం గండేర్బల్‌ జిల్లా మీదుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడడం ఆందోళన కలిగిస్తోంది.


కర్ణాటక వ్యాపారి మృతి..

ఉగ్రవాదుల దాడిలో కర్ణాటకకు చెందిన స్థిరాస్తి వ్యాపారి మంజునాథ రావు మరణించారు. ఆయన భార్య పల్లవి, ఎనిమిదేళ్ల కుమారుడు క్షేమంగా ఉన్నారు. కశ్మీరు పర్యటనకు వెళ్లిన పలువురు కన్నడిగులు ప్రమాదంలో ఉండడంతో సీఎం సిద్దరామయ్య అప్రమత్తమయ్యారు. మంగళవారం సాయంత్రం సీఎస్‌, పోలీసు ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. కర్ణాటక వాసులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులను వెంటనే కశ్మీరుకు పంపారు. ఉగ్రదాడిలో మరణించిన మంజునాథ శివమెగ్గలోని విజయ్‌నగర్‌ వాసి. భార్య, కుమారుడితో కలిసి ఈ నెల 19న కశ్మీరు పర్యటనకు వెళ్లారు.

రక్తం మరిగిపోతోంది: సిన్హా

పహల్గాం ఉగ్రదాడి బాధ్యులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జమ్మూకశ్మీరు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అన్నారు. ఈ దాడిపై యావత్‌ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోందని, మన బలగాల రక్తం మరిగిపోతోందని పేర్కొన్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మన బలగాలు రంగంలోకి దిగాయన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.


పోయి.. మోదీకి చెప్పు..!!

‘‘పో.. ఇక్కడి జరిగింది మోదీకి చెప్పు’’.. నన్ను కూడా చంపేయండి అని తన భర్తను చంపిన ఉగ్రవాదుల ఎదుట రోదించిన మహిళకు ఓ ఉగ్రవాది ఇచ్చిన సమాధానమిది. కర్ణాటకలోకి షిమోగకు చెందిన మంజునాథ్‌, పల్లవి, తమ కుమారుడు అభిజయ్‌తో కలిసి కశ్మీరు పర్యటనకు వెళ్లి పహల్గాం సందర్శనకు వెళ్లగా.. మంజునాథ్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ‘‘ముగ్గురు, నలుగురు మాపై దాడి చేశారు. నా కళ్ల ముందే నా భర్తను కాల్చారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నా భర్తను చంపారుగా నన్ను కూడా చంపేయండి.. అని వాళ్లని అడిగా.. మేము నిన్ను చంపం.. పోయి ఇక్కడ జరిగింది మోదీకి చెప్పు.. అని వాళ్లలో ఒకరు బదులిచ్చారు’’ దాడి అనంతరం పల్లవి చెప్పిన మాటలివి.

హనీమూన్‌లో విషాదం...

‘‘నేను, నా భర్త బేల్‌పూరీ తింటున్నాం. తుపాకీ పట్టుకున్న ఓ వ్యక్తి హఠాత్తుగా వచ్చి.. మీది ఏ మతం అని అడిగాడు. హిందువు అని నిర్ధారించుకుని నా భర్త తలపై తుపాకీ పట్టి కాల్చేశాడు’’.. ఈ మధ్యనే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని అందంగా ప్రారంభించాలని హనీమూన్‌కు కశ్మీరు వచ్చి ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన యువతి ఆ షాక్‌ నుంచి కాస్త తేరుకున్న తర్వాత చెప్పిన మాటలివి. రక్తపుమడుగులో పడి ఉన్న భర్త మృతదేహం పక్కన విషణ్ణ వదనంతో ఆ యువతి కూర్చున్నప్పుడు తీసిన ఓ ఫొటో ఆమె ఆవేదనను వివరించింది.


ఇవి కూడా చదవండి

జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..

Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..

Updated Date - Apr 23 , 2025 | 06:40 AM