Tejaswi Yadav: ఓటర్ల జాబితాలో నా పేరు లేదన్న తేజస్వి.. ఈసీ కౌంటర్
ABN , Publish Date - Aug 02 , 2025 | 02:58 PM
ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎలాంటి పారదర్శకత లేకుండా నిర్వహించిందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. రాజకీయ పార్టీలను లూప్ నుంచి దూరంగా ఉంచి, పేద, అట్టడుగు ఓటర్లను టార్గెట్ చేసుకుని సామూహికంగా తొలగించిందన్నారు.

పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేత తేజస్వి యాదవ్ (Tejaswai Yadav) శనివారంనాడు రాజకీయ వివాదానికి తెరలేపారు. కొత్తగా విడుదల చేసిన బిహార్ (Bihar) ఓటర్ల జాబితా (Voters list)లో తన పేరు లేదని తెలిపారు. అయితే, ఎన్నికల కమిషన్ (EC) ఆ వెంటనే స్పందించింది. సీరియల్ నెంబర్ 416లో ఆయన పేరు ఉందని పేర్కొంది.
లైవ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో..
తేజస్వి యాదవ్ లైవ్ కాన్ఫరెన్స్‌లో మట్లాడుతూ, ఓటర్ల జాబితాలో తన పేరు కూడా మాయమైందని అన్నారు. ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎలాంటి పారదర్శకత లేకుండా నిర్వహించిందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను లూప్ నుంచి దూరంగా ఉంచి, పేద, అట్టడుగు ఓటర్లను టార్గెట్ చేసుకుని సామూహికంగా తొలగించిందన్నారు. ఇలాంటి రివిజన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అడ్వయిజరీని కూడా ఈసీ పక్కనపెట్టేసిందని చెప్పారు. విపక్ష పార్టీల సూచనలను బేఖాతరు చేసిందని అన్నారు. 'ఓటర్ల పేర్లు తొలగించమని చెప్పారు. కానీ పేద ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నారు' అని ఈసీపై మండిపడ్డారు.
ప్రూఫ్ ఇదిగో.. ఈసీ
తన పేరు కనిపించడం లేదన్న తేజస్వి యాదవ్ వాదనను ఈసీ కొట్టివేసింది. అధికారిక ముసాయిదా జాబితాను విడుదల చేస్తూ సీరియల్ నెబర్ 416లో ఆయన పేరుందని తెలిపింది. ప్రామాణిక విధానం అనుసరించి ఓటర్ల తొలగింపుపై సమగ్ర సమాచారం అన్ని పార్టీలకు అందిస్తున్నామని చెప్పింది. నిర్దిష్ట ప్రక్రియ ద్వారా ఓటర్ల రివిజన్ చేపట్టామని, అప్పీల్ చేసుకునేందుకు సెప్టెంబర్ 1వ తేదీ వరకూ అవకాశం కల్పించామని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఓట్లు తొలగింపు
ఈసీ శుక్రవారంనాడు విడుదల చేసిన డాటా ప్రకారం, బీహార్ వ్యాప్తంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 6,564,075 పేర్లను ఈసీఐ తొలగించింది. రాష్ట్రంలో రిజిస్ట్రర్డ్ ఓటర్ల సంఖ్య 7.89 కోట్ల నుంచి 7.24 కోట్లకు తగ్గింది. పాట్నాలో అత్యధికంగా ఓట్ల తొలగింపు జరుగగా, గయ, సీతామర్హి, అరారియా, పూర్ణయా, దర్బంగా, సివాన్, వైశాలి, బెగుసరాయి, జముయి జిల్లాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది.
ఎన్యూమరేషన్ ఫారంలు అందకపోవడంతో పేర్లు తొలగించినట్టు ఈసీఐ వివరణ ఇచ్చింది. బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల నామినెటెడ్ అధికారులు ఈ దరఖాస్తులను డిస్ట్రిబ్యూట్ చేయగా, 65.64 లక్షల దరఖాస్తులు తిరిగి రాలేదు. దీంతో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించారు. కాగా, ఎస్ఐఆర్ ప్రక్రియపై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు కురిపించాయి. పార్లమెంటులో ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టపట్టగా, ప్రీసీజర్ లిమిటేషన్స్‌ను ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నిర్వహణా చర్యలపై పార్లమెంటులో చర్చించలేమని లోక్‌సభ స్పీకర్ బలరాం జాఖడ్ రూలింగ్ ఇచ్చినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పాతాళ లోకంలో దాగినా వదలబోం.. మళ్లీ దాడి చేస్తే మాత్రం..
పీఎం కిసాన్ 20వ విడత నగదు విడుదల చేసిన ప్రధాని మోదీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి