Sonaia Sacrificed Power: పీఎం పదవిని సోనియా త్యాగం చేశారు.. సీఎం సమక్షంలో డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 08:22 PM
ఆర్థికశాస్త్రంలో నిపుణులైన మన్మోహన్‌ను ప్రభుత్వాధిపతిగా సోనియాగాంధీ ఎన్నుకున్నారని, ఆశా వర్కర్ల స్కీమ్ వంటి పలు సంక్షేమ చర్యల్లో ఆమె నాయకత్వ శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు తెరపడటం లేదు. నాయకత్వ మార్పు ఉండదని సీఎం సిద్ధరామయ్య వర్గీయులు చెబుతుండగా, అధికార మార్పిడి అగ్రిమెంట్‌ను అమలు చేయాలని డీకే వర్గీయులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారంనాడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇరవై ఏళ్ల క్రితమే దేశ ప్రధానిగా అవకాశం వచ్చినప్పటికీ ఆ పదవిని సోనియాగాంధీ (Sonia Gandhi) త్యాగం చేశారని డీకే శివకుమార్ ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సిద్ధారామయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
'సోనియా గాంధీ 20 ఏళ్లకు పైగా దేశ కాంగ్రెస్ నేతగా ఉన్నారు. ఆమె అధికారాన్ని త్యాగం చేశారు. ఆ రోజుల్లో (2004) సోనియాగాంధీ ప్రధాని కావాలని అబ్దుల్ కలామ్ (మాజీ రాష్ట్రపతి) కోరుకున్నారు. అయితే ఆమె అధికారాన్ని త్యాగం చేసి, తనకు బదులుగా ప్రధానమంత్రి పదవికి మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారు' అని డీకే శివకుమార్ తెలిపారు. ఆర్థికశాస్త్రంలో నిపుణులైన మన్మోహన్‌ను ప్రభుత్వాధిపతిగా సోనియాగాంధీ ఎన్నుకున్నారని, ఆశా వర్కర్ల స్కీమ్ వంటి పలు సంక్షేమ చర్యల్లో ఆమె నాయకత్వ శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ప్రశంసించారు.
కాగా, కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో శనివారంనాడు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్గొంటారని సమాచారం. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ త్యాగాలను డీకే ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి..
77 అడుగుల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
ఉడిపిలో లక్ష కంఠ గీతా పఠనం.. హాజరైన మోదీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.