Bihar Election Results: ఆర్జేడీకి పొంచివున్న మరో ముప్పు
ABN , Publish Date - Nov 16 , 2025 | 09:38 PM
బిహార్ నుంచి వచ్చే ఏడాది రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 42 సీట్లు ఉండాలి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ కేవలం 35 సీట్లు సాధించింది.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన రాష్ట్రీయ జనతాదళ్ (RJD)కు మరో ముప్పు పొంచి ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఆర్జేడీ ప్రాతినిధ్యం కోల్పోయే అవకాశం ఉంది.
బిహార్ నుంచి రాజ్యసభకు మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. వీటిలో ఆర్జేడీకి 5 సీట్లు ఉన్నాయి. వీటికి మనోజ్ ఝా, సంజయ్ యాదవ్, ఫైయజ్ అహ్మద్, ప్రేమ్‌చంద్ గుప్తా, అమరీంద్ర ధారి సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సింగ్, గుప్తా పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. 2028లో ఫైయజ్ అహ్మద్ పదవీకాలం ముగియనుండగా, మనోజ్ ఝా, సంజయ్ యాదవ్ పదవీకాలం 2030 ఏప్రిల్‌లో ముగుస్తుంది. బిహార్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు 2030లో జరుగుతాయి.
బిహార్ నుంచి వచ్చే ఏడాది రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలంటే అసెంబ్లీలో కనీసం 42 సీట్లు ఉండాలి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ కేవలం 35 సీట్లు సాధించింది. ఆర్జేడీ 25, కాంగ్రెస్ 6, సీపీఐఎంఎల్ 2, సీపీఎం 1, ఐఐపీ 1 సీటు గెలుచుకున్నాయి. దీంతో రాజ్యసభకు వచ్చే ఏడాది జరగనున్న రెండు స్థానాల్లోనూ ఆర్జేడీ గెలిచే అవకాశాలు లేవు. అధికార ఎన్డీయేనే ఈ సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం రాజ్యసభలో ఎన్డీయే సంఖ్యాబలం పెరిగేందుకు దోహదపడుతుంది. రాజ్యసభలో బీజేపీకి ఇప్పటికీ సొంతంగా మెజారిటీ లేదు.
ఈ ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 243 స్థానాలకు 202 సీట్లలో గెలుపొందింది. బీజేపీ 89 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. జేడీయూ 85 స్థానాల్లో గెలిచి ఆ తదుపరి స్థానంలో ఉంది. ఎల్జేపీ(ఆర్వీ) 19, హెచ్ఏఎం (సెక్యులర్) 5, ఆర్ఎల్ఎం 4 సీట్లు గెలుచుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎన్నికల ఫలితాలు.. లాలూ కూతురి వరుస పోస్టులు..
లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.