Rohini Acharya Row: నా చెల్లెల్ని అవమానిస్తే సహించను... రోహిణికి సపోర్ట్‌గా తేజ్ ప్రతాప్
ABN , Publish Date - Nov 16 , 2025 | 06:14 PM
తేజ్ ప్రతాప్ తన సోదరి రోహిణి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో జేజేడీ అధికార ఖాతా నుంచి షేర్ చేశారు. తనకు అన్యాయం జరిగితే భరించానని, అయితే తన చెల్లెల్ని అవమానిస్తే మాత్రం మౌనంగా చూస్తూ ఉండేది లేదని హెచ్చరించారు.
పాట్నా: లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో తలెత్తిన కల్లోలంపై ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) స్పందించారు. తన చెల్లెలు రోహిణి ఆచార్య (Rohini Acharya)కు బాసటగా ఉంటానని, ఆమెను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన సోదరికి జరిగిన అవమానం సహించరానిదని అన్నారు. తనను అవమానించి దాడి చేశారంటూ వరుస ట్వీట్లలో రోహిణి ఆచార్య ఆరోపించారు. పార్టీ దయనీయ ఫలితాలపై ప్రశ్నించినందుకు తన సోదరుడు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav), ఆయన సన్నిహితులైన ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ (Sanjay Yadav), రమీజ్ నేమత్ (Rameez Nemat) తనపై దాడి చేసి కొట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయాలకు, కుటుంబానికి కూడా గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ ఆమెకు అండగా నిలబడ్డారు.
గుండె మండుతోంది...
తేజ్ ప్రతాప్ తన సోదరి రోహిణి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో జేజేడీ అధికారిక ఖాతా నుంచి షేర్ చేశారు. తనకు అన్యాయం జరిగితే భరించానని, అయితే తన చెల్లెల్ని అవమానిస్తే మాత్రం మౌనంగా చూస్తూ ఉండేది లేదని హెచ్చరించారు. తన సోదరిని చెప్పుతో కొట్టారనే విషయం తెలిసి తన గుండె రగిలిపోయిందన్నారు. నేరుగా ఎవరి పేరునూ ఆయన ప్రస్తావించకుండా... తన కుటుంబంపై దాడి చేసిన వంచకులను (Jaichands) బిహార్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు.
ఒక్క సైగ చేస్తే చాలు..
ఈ విషయంలో తన తండ్రి లాలూ ప్రసాద్ జోక్యం చేసుకోవాలని తేజ్ ప్రతాప్ కోరారు. 'మీరు (లాలూ) ఒక్క సైగ చేయండి చాలు. ఈ జయచంద్‌లను బిహార్ ప్రజలు పూడ్చిపెడతారు' అని తేజ్ ప్రతాప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదేమీ రాజకీయ పోరాటం కాదని, ఇది ఒక కుటుంబ గౌరవం, ఒక ఆడకూతురు గౌరవం, బిహార్ ఆత్మాభిమానంపై జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి..
కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎన్నికల ఫలితాలు.. లాలూ కూతురి వరుస పోస్టులు..
బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.