Bihar Government Formation: ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి ఫార్ములా
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:22 PM
ఎన్డీయే ప్రతిపాదించినట్టు చెబుతున్న ఫార్ములా ప్రకారం, బీజేపీకి కేబినెట్‌లో సింహభాగం వాటా దక్కనుంది. 15 నుంచి 16 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. జేడీయూకు 14 మంత్రి పదవుల వరకూ దక్కవచ్చు.
పాట్నా: బిహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. కేబినెట్ కూర్పు కోసం ఒక ఫార్ములాను రూపొందించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ప్రకారం కూటమిలోని ప్రతి పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున నితీష్ కేబినెట్‌లో చోటు కల్పించనున్నట్టు సమాచారం. కేంద్రం హోం మంత్రి అమిత్‌తో జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ సహా ఎన్డీయే కూటమి సీనియర్ నేతలు శనివారంనాడు సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేబినెట్ కూర్పునకు సంబంధించిన ఫార్ములాపై చర్చించినట్టు తెలుస్తోంది.
ఎన్డీయే ప్రతిపాదించినట్టు చెబుతున్న ఫార్ములా ప్రకారం, బీజేపీకి కేబినెట్‌లో సింహభాగం వాటా దక్కనుంది. 15 నుంచి 16 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. జేడీయూకు 14 మంత్రి పదవుల వరకూ దక్కవచ్చు. చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ (రామ్ విలాస్)కి 3 మంత్రి పదవులు, జితిన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం (సెక్యులర్)కు ఒకటి, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్ఎంకు ఒక మంత్రి పదవి దక్కే వీలుంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. 243 అసెంబ్లీ స్థానాల్లో 202 సీట్లు దక్కించుకుంది. బీజేపీ 89 స్థానాల్లో గెలిచి ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 సీట్లతో ఆ తర్వాత స్థానంలో ఉంది. ఎల్జేపీ-ఆర్వీ 19 సీట్లు, హెఏఎం(ఎస్) 5, ఆర్ఎల్ఎం 4 సీట్లు గెలుచుకున్నాయి.
కాగా, కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ సాధ్యమైనంత త్వరలోనే ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎవరనేది కూడా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. అయితే పాశ్వాన్, మాంఝీ వంటి నేతలు నితీష్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. సీఎం పదవిలో నితీష్ కొనసాగుతారని చెబుతున్నారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారంనాడు నితీష్ మంత్రివర్గం సమావేశమై త్వరలో గడువు తీరనున్న అసెంబ్లీని రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం నితీష్ తన రాజీనామాను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు సమర్పిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తారు.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఎన్నికల కోసం రూ.14,000 కోట్లు మళ్లించిన కేంద్రం.. జన్‌సురాజ్ సంచలన ఆరోపణ
రోహిణి ఆచార్యపై దాడి చేసిన రమీజ్ నేమత్ ఎవరంటే..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.