Delhi Blasts: ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు 10 రోజుల పాటు అద్దె ఇంట్లో నిందితుడి మకాం
ABN , Publish Date - Nov 16 , 2025 | 04:37 PM
ఢిల్లీ పేలుడుకు ముందు పది రోజుల పాటు నిందితుడు డా. ఉమర్ హర్యానాలోని నూహ్ జిల్లాలో అద్దె ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానిక సీసీటీవీ కెమెరా ఫుటేజీలో కూడా అతడి కదలికలు రికార్డయ్యాయి. ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితుల కుట్ర ఏమిటో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ కారు బాంబు పేలుడుతో అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ గురించి పోలీసుల దర్యాప్తులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. దాడికి ముందు పది రోజుల పాటు నిందితుడు ఉమర్ హర్యానాలోని నూహ్ జిల్లాలో ఓ అద్దె ఇంట్లో ఉన్నట్టు బయటపడింది (Delhi Car Blasts Case).
పేలుడు పదార్థాలు ఉన్న కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన డా. ఉమర్ ఈ దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతడు కూడా మృతి చెందాడు. అయితే, దాడికి మునుపు అతడు ఎక్కడెక్కడ సంచరించాడనేది తెలుసుకునేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దాడి ముందు పది రోజుల పాటు అతడు హర్యానాలోని నూహ్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. స్థానికంగా ఓ కాలనీలో అద్దె ఇంట్లో ఉన్నాడు. ఘటన జరిగిన రోజున అతడు దాడి కోసం రెడీ చేసుకున్న కారులో నూహ్ నుంచి బయలుదేరాడు. అక్కడి ఓ డయాగ్నెస్టిక్ సెంటర్ సీసీటీవీ కెమెరాల్లో మొహమ్మద్ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం రికార్డయ్యింది. ఆ రోజు ఏ సమయంలో అతడు ఇంటి నుంచి బయలుదేరాడనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఏ రూట్‌లో పయనించాడనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది (Dr Umar Rented House in Nuh).
అతడు ఉంటున్న అద్దె ఇల్లు ఢిల్లీ-అల్వార్ రోడ్డులో ఉంది. అల్ ఫలాలా యూనివర్సిటీలో షోయెబ్ అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. అతడి బంధువు ఇంట్లోనే ఉమర్ అద్దెకు ఉన్నాడు. పేలుడుకు ముందు అతడు నూహ్ జిల్లాలోనే ఉన్నట్టు సీసీటీవీ కెమెరా ఫుటేజీలో స్పష్టమైంది. ఫిరోజ్‌పూర్ ఝిర్ఖా వద్ద అతడు రోడ్డు దాటుతున్నప్పుడు, ఓ ఏటీఎమ్ వద్ద డబ్బు విత్‌డ్రా చేస్తున్నప్పుడు అతడు సీసీ కెమెరా కంటికి చిక్కాడు.
అల్ ఫలాహ్ యూనివర్సిటీలో డా. ఉమర్ సహోద్యోగులు షహీన్ సయీద్, ముజమ్మిల్ షకీల్, అదిల్ రథార్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఎన్‌సీఆర్ ప్రాంతమంతటా పేలుళ్లు జరిపేందుకు వారు కుట్ర పన్నారా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులు ఉంటున్న ఇళ్ల నుంచి పోలీసులు ఇప్పటివరకూ 3 వేల కిలోల బాంబు తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, దేశవ్యాప్తంగా భారీ కుట్రకు నిందితులు ప్లాన్ చేసే ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి:
బిహార్ ఎన్నికల కోసం రూ.14,000 కోట్లు మళ్లించిన కేంద్రం.. జన్‌సురాజ్ సంచలన ఆరోపణ
రోహిణి ఆచార్యపై దాడి చేసిన రమీజ్ నేమత్ ఎవరంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి