PM Modi-Trump Phone Call: ప్రధాని మోదీ- డోనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ పై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Jun 18 , 2025 | 09:50 PM
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో ఏం మాట్లాడారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మూడు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో ఏం మాట్లాడారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మూడు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ప్రధాని తిరిగి వచ్చిన వెంటనే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ట్రంప్ తో 35 నిమిషాలు మాట్లాడిన విషయాలన్నీ వివరించాలని కూడా రమేష్ కోరారు. అలాగే ట్రంప్‌తో మోదీ చర్చించిన అన్ని విషయాలను చెప్పడానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కార్గిల్ యుద్ధం తర్వాత రివ్యూ కమిటీ ఏర్పాటు చేసినట్లే పహల్గాంపై కూడా రివ్యూ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయలేదని జైరాం ప్రశ్నించారు. వాణిజ్య ఒప్పందం పేరుతో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చినట్లు అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలను పార్లమెంటులో ఖండించాల్సిన అవసరం ఉందని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాల్పుల విరమణకు ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాక్ సైన్యాధిపతి మునీర్ విందు చేయడం, అమెరికా.. పాకిస్థాన్ ను భాగస్వామిగా చెప్పడం, భారత్ దౌత్యనికి పెద్ద దెబ్బగా రమేష్ అభివర్ణించారు. దీనిపై మే 10వ తేదీ నుంచి ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని.. డోనాల్డ్ ట్రంప్ 14 సార్లు చేసిన కామెంట్స్ ను ఖండించడానికి ప్రధాని మోదీకి 37 రోజులు ఎందుకు అవసరమైందని రమేష్ ప్రశ్నించారు.
ఇంతకీ ఇప్పుడు ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు హైలెట్ చేస్తుందన్న విషయానికొస్తే.. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్పష్టంగా చెప్పినట్లు కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా వెల్లడించారు. ట్రంప్ తో మోదీ ఫోన్లో మాట్లాడినట్లు కూడా మిస్త్రీ చెప్పారు. జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ-ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉందని.. అయితే, ట్రంప్ ముందుగానే వెళ్లిపోవడం వల్ల ఆ సమావేశం జరగలేదని కూడా మిస్త్రీ చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ సైనికాధిపతి అసిమ్ మునీర్‌కు ఆతిథ్యం ఇవ్వడం కోసమే ట్రంప్ ప్రధాని మోదీతో ట్రంప్ తన భేటీని రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసిన మునీర్‌కు ట్రంప్ ఆతిథ్యంపై భారత్ తన అసంతృప్తిని టెలిఫోన్ సంభాషణలో మోదీ చెప్పి ఉండాల్సిందని కాంగ్రెస్ అంటోంది.
ఇవి కూడా చదవండి..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..