Share News

PM Modi: జాతీయ భద్రతపై పరిహాసమా.. విపక్షాలపై మోదీ ఫైర్..

ABN , Publish Date - Jul 29 , 2025 | 08:22 PM

కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు పాక్‌ అధికార ప్రతినిధులుగా మారాయని ప్రధాని మోదీ విమర్శించారు. భారత్ సైన్యం విజయవంతంగా సర్జికల్స్ స్ట్రైక్స్ జరిపితే రుజువులు చూపించాలని అడుగుతోందని, అయితే సాక్ష్యాలకేమీ కొదవలేదని అన్నారు మోదీ.

PM Modi: జాతీయ భద్రతపై పరిహాసమా.. విపక్షాలపై మోదీ ఫైర్..
PM Modi

న్యూఢిల్లీ: దేశ భద్రతపై రాజకీయాలు తగదని, స్వప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేసే నేతలు వార్తల్లో ప్రముఖంగా ఉండొచ్చేమో కానీ ప్రజల మనస్సులు గెలవలేరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యావద్దేశం కేంద్రానికి సపోర్ట్ చేస్తే 'సాహెబ్' వచ్చి తమ ప్రయత్నాలను సభలో పరిహాసం చేస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్‌ అగ్రనేత తీరుపై విమర్శలు గుప్పించారు మోదీ. ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రపంచ మద్దతు దొరికింది కానీ, కాంగ్రెస్‌ మద్దతు దొరకలేదని, తనను విమర్శించడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.


ఈ సందర్భంగా విపక్షాల తీరుపై దేశమంతా నవ్వుకుంటోందని మోదీ విసుర్లు విసిరారు. పాకిస్థాన్‌ను కాంగ్రెస్ వెనకేసుకురావడం దురదృష్టకరమని ఆరోపించారు. పాక్‌కు పైలట్ అభినందన్‌ చిక్కినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారని, కానీ ఆయన సురక్షితంగా భారత్ తెచ్చామని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజాపక్షమేనని, ప్రజల మనోభావాలు, వారు తనపై ఉంచిన నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని భారత రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారు. మన సాయుధ బలగాలు కేవలం 22 నిమిషాల్లోనే ఆపరేషన్ లో కీలకమైన దాడులు పూర్తి చేశాయని, 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని మోదీ చెప్పడంతో అధికార సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. పహల్గాం దాడి తర్వాత భారత్ గట్టిగా స్పందిస్తుందని పాక్ ఆలోచన చేసిందని, ఆ పని తాము చేసి చూపించామని ప్రధాని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మాస్టర్ మైండ్స్‌కు నిద్ర దూరమైందని చెప్పారు.


అణు హెచ్చరికలకు బెదరలేదు

పాక్ అణు హెచ్చరికలకు బెదరలేదని, అదంతా అబద్ధమని తాము నిరూపించామని మోదీ చెప్పారు. న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్ కు భారత్ లొంగే ప్రసక్తే లేదన్నారు. పాక్‌కు ఏళ్ల తరబడి గుర్తుండే పాఠం భారత సైన్యం ఇచ్చిందని చెప్పారు. త్రివిధ దళాల సమన్వయానికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని, మేడిన్ ఇండియా డ్రోన్లు, మిసైళ్లు పాక్‌ను చీల్చిచెండాడాయని అన్నారు. ఉగ్రవాద ప్రభుత్వాన్ని, ఉగ్రనేతలను తాము వేర్వేరుగా చూడమని చెప్పారు. పాక్‌ ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలకు గానూ 193 దేశాల్లో కేవలం 3 దేశాలే పాక్‌ను సమర్ధించాయని మోదీ వివరించారు. దాడి ఆపండని పాక్ గగ్గోలు పెట్టి వేడుకుందని, పాక్ డీజీఎంవో ఫోన్ చేసి వేడుకున్నారని తెలిపారు. పాక్ మళ్లీ దాడి చేసే సాహనం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని మోదీ హెచ్చరించారు.


పాక్ ఎజెండా దిగుమతి

పాక్ కోసం కాంగ్రెస్ దిగజారిపోతోందని మోదీ తన ప్రసంగంలో తప్పుపట్టారు. పాక్ ఎజెండాను కాంగ్రెస్ దిగుమతి చేసుకున్నట్టు ఉందన్నారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు పాక్‌ అధికార ప్రతినిధులుగా మారాయన్నారు. సైన్యం విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ జరిపితే రుజువులు చూపించాలని అడుగుతోందని, అదేమంత పెద్ద విషయం కాదని అంటోందని మండిపడ్డారు. సాక్ష్యాలకేమీ కొదవలేదని, అంతా కళ్లముందే ఉందని మోదీ సుస్పష్టం చేశారు.


నెహ్రూ అలా చేశారు

దేశ భద్రతపై కాంగ్రెస్‌ది ఎప్పుడూ రాజీ ధోరణనేనని అన్నారు ప్రధాని మోదీ. తాము పాక్‌కు ఇచ్చిన 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్'ను రద్దు చేశామని, అట్టారి మూసేశామని, సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేశామని చెప్పారు. నదీ జలాల పరిష్కార బాధ్యతను నెహ్రూ వరల్డ్ బ్యాంకుకు అప్పగించారని.. నది మనది-నీళ్లు మనది-పెత్తనం మాత్రం వాళ్లదని ఆక్షేపణ తెలిపారు. 80 శాతం నీళ్లు పాక్‌కు అప్పగించారని చెబుతూ.. ఇదేం తెలివి? ఇదేం దౌత్యనీతి అని ప్రధాని నిలదీశారు.


ఇవి కూడా చదవండి..

సిందూర్ శపథాన్ని నెరవేర్చాం.. అందుకే ఈ విజయోత్సవం

కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Jul 29 , 2025 | 09:13 PM