Share News

Parliament Session: పాక్ దురాగతమే.. సాక్ష్యాలున్నాయ్

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:50 PM

ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఓటర్ ఐడీ కార్డులు, చాకొలెట్ రేపర్లు పాకిస్థాన్‌లో తయారైనవేనని అమిత్‌షా చెప్పారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రెండోరోజు మంగళవారంనాడు జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.

Parliament Session: పాక్ దురాగతమే.. సాక్ష్యాలున్నాయ్
Amit Shah

న్యూఢిల్లీ: ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు తమ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తెలిపారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఓటర్ ఐడీ కార్డులు, చాకొలెట్ రేపర్లు పాకిస్థాన్‌లో తయారైనవేనని చెప్పారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రెండోరోజు మంగళవారంనాడు జరిగిన చర్చలో అమిత్‌షా పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రవాదులు స్థానికులు కావచ్చని, పాక్ నుంచి వచ్చాయనడానికి ఆధారాలేమిటని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ప్రశ్నించడంపై హోం మంత్రి సూటిగా స్పందించారు. 'పాక్‌ను వెనకేసుకు రావడం వల్ల మీరు సాధించిన దేమిటి? అని ప్రశ్నించారు.


'టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇందుకు బాధ్యులెవరు? నిన్న వాళ్లు (కాంగ్రెస్) అడిగారు. సరే..మేము అధికారంలో ఉన్నందున మాదే బాధ్యత. మాజీ హోం మంత్రి చిదంబరం ఒక ప్రశ్న వేశారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చారనడానికి ఆధారాలేవని అడిగారు. ఆయనను నేను ఒకటి అడగదలచుకున్నాను. పాకిస్థాన్‌ను వెనకేసుకుని రావడం వల్ల మీకు కలిసొచ్చేదేమిటని అడుగుతున్నాను. ఈ మాట ఆయన అంటున్నారంటే పాకిస్థాన్‌కు క్లీన్ చిట్ ఇస్తున్నట్టే కదా' అని అమిత్‌షా అన్నారు.


చిదంబరం ఏమన్నారు?

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చ ప్రారంభం కావడానికి ముందు చిదంబరం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదం సృష్టించాయి. జూలై 27న జరిగిన ఒక ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ, ఉగ్రవాదులు స్థానికులు కూడా కావచ్చని, వారికి పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయనేందుకు ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు. ఆపరేషన్ విషయంలో కేంద్రానికి పారదర్శకత లేదని విమర్శించారు. 'టెర్రరిస్టు అటాకర్లు ఎక్కడివారు? వారిని మీరెందుకు పట్టుకోలేదు? అకస్మాత్తుగా ఒక వార్త వెలుగుచూసింది. టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరు, ముగ్గురిని పట్టుకున్నామని చెప్పారు. అదేమిటది?' అని చిదంబరం ప్రశ్నించారు. కాగా, తన వ్యాఖ్యలపై అధికార పక్షం నుంచి విమర్శలు రావడంపై చిదంబరం తిరిగి వివరణ ఇచ్చారు. తన ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కాకుండా ఎక్కడికక్కడ కత్తిరించి సమాచారాన్ని వక్రీకరించారని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

ఆపరేషన్ సిందూర్‌కు విపక్షాలు సంపూర్ణంగా సహకరించినందుకు గర్విస్తున్నా

ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Jul 29 , 2025 | 06:13 PM