Karnataka: పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు.. ఆ మరుక్షణమే కొట్టి చంపేశారు..
ABN , Publish Date - Apr 29 , 2025 | 06:49 PM
పహల్గాంలో ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో అట్టుడుకుతోంది. ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వినిపించినా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. చివరకు ఏం జరిగిందంటే..

పహల్గాంలో ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో అట్టుడుకుతోంది. ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వినిపించినా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. ఆ మరుక్షణమే అంతా కలిసి అతన్ని కొట్టి చంపేశారు. కర్నాటకలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కర్ణాటక (Karnataka) మంగళూరులోని కుడుపు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక భత్రా కల్లుర్తి ఆలయ సమీపంలో ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ (Cricket tournament) నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. సుమారు 100 మందికి పైగా మ్యాచ్ ఆడేందుకు వచ్చారు. ఈ టోర్నమెంట్‌ను చూసేందుకు చాలా మంది క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. అయితే మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యాహ్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఓ యువకుడు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ గట్టిగా నినాదాలు (Pakistan Zindabad slogans) చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అలాంటి నినాదాలు చేయొద్దంటూ అతడితో గొడవకు దిగారు. ఈ క్రమంలో సచిన్ అనే వ్యక్తి ఆ యువకుడితో గొడవకు దిగాడు. తర్వాత మరికొంతమంది అతడితో జత కలిశారు. ఈ వాదన కాస్తా.. కాసేపటికి గొడవకు దారి తీసింది. అంతా కలిసి ఆ యువకుడిపై మూకుమ్మడిగా (Assault on youth) దాడి చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చాలా మంది అతడిపై బలంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడిలో అంతర్గత అవయవాలు దెబ్బతినడం వల్లే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడిలో సుమారు 25 మందికి పైగా పాల్గొన్నట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర రావు స్పందించారు. మృతుడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వాడనే విషయం తెలియరాలేదని చెప్పారు. పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేయడం వల్లే అతడిపై దాడి జరిగిందన్నారు. ఇలా నినాదాలు చేస్తే పోలీసులకు సమాచారం అందించాలి గానీ.. ఇలా భౌతిక దాడులు చేయడం తగదనన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.