Share News

Opposition Demands: ఉగ్రక్యాంపులను నాశనం చేయాల్సిందే

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:47 AM

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద క్యాంపులను నాశనం చేయాలని అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పహల్గాంలో జరిగిన దాడికి సంబంధించి, భద్రతా వైఫల్యాలు కూడా ఉన్నాయని అఖిలపక్షం అంగీకరించింది

Opposition Demands: ఉగ్రక్యాంపులను నాశనం చేయాల్సిందే

  • కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తాం

  • జాతీయ భద్రత అంశంలో రాజకీయాల్లేవ్‌

  • ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడదాం

  • అఖిలపక్ష సమావేశం ప్రకటన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో కల్లోలం రేపుతున్న పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద క్యాంపులను నాశనం చేయాల్సిందేనని అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పహల్గాం దాడి నేపథ్యంలో మోదీ సర్కారు ఏ చర్య తీసుకున్నా పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించింది. జాతీయ భద్రత విషయంలో రాజకీయాలకు తావు లేదని, ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడుతామని స్పష్టం చేసింది. గురువారం పార్లమెంట్‌ ప్రాంగణంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జైశంకర్‌, నిర్మల సీతారామన్‌, కిరెణ్‌ రిజిజు ప్రభుత్వం నుంచి పాల్గొనగా.. ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, బీజేడీ నేత సస్మిత్‌ పాత్రా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌, తృణమూల్‌ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ, టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఉగ్రదాడి మృతులకు అంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఉగ్రదాడి ఘటన గురించి, దానిపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరాలు వెల్లడించారు. అఖిలపక్షంలో పాల్గొన్న నేతలందరూ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. జాతీయ భద్రత విషయంలో రాజకీయాలకు తావు లేదని, కలిసికట్టుగా నిలుద్దామని చెప్పారు.


కఠిన చర్యలు చేపట్టే ఉద్దేశంతో ప్రభుత్వం..

అఖిలపక్షం అనంతరం కిరెణ్‌ రిజిజు మాట్లాడారు. ఉగ్రదాడి అంశంలో అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ భేటీలో వెల్లడించారని చెప్పారు. దాడి వెనుక పాక్‌ హస్తం ఉందని, వారికి ఎలా గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నదీ వివరించారని తెలిపారు. ప్రభుత్వానికి అన్ని విధాలా మద్దతు ఇస్తామని తనతో సహా ప్రతిపక్ష నేతలంతా ముక్తకంఠంతో చెప్పారని రాహుల్‌గాంధీ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారని మల్లికార్జున ఖర్గే చెప్పారు. సాధ్యమైనంత త్వరగా జమ్ముకశ్మీర్‌లో శాంతి ఏర్పడటం అవసరమన్నారు. ఉగ్రదాడిలో గాయపడి అనంతనాగ్‌లో చికిత్స పొందుతున్న వారిని రాహుల్‌ గాంధీ శనివారం పరామర్శించనున్నారని తెలిపారు. ఇక భద్రతా వైఫల్యంపై చర్చించామని, తగిన చర్యలు తీసుకోవాలని కోరామని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌, తృణమూల్‌ ఎంపీ సుదీప్‌ వివరించారు.


రాజకీయాలకు తావు లేదు: లావు శ్రీకృష్ణ

గత పదేళ్లలో కశ్మీర్‌లో భద్రతను ఎంతగా పెంచారో, ఉగ్రవాద చర్యలు ఎలా తగ్గుముఖం పట్టాయో అఖిలపక్షంలో కేంద్రం వివరించిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. దేశ భద్రతలో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం, జాతీయ భద్రతపై ఎంత దూరం వెళ్లినా మద్దతుగా నిలుస్తాం. టీడీపీ తరఫున పూర్తి సహకారం ఉంటుంది. నేను పదిరోజుల క్రితమే కశ్మీర్‌లోని గుల్మార్గ్‌ వెళ్లి స్థానికులను కలిశాను. గత ఐదారేళ్లలో టూరిజం ఎంతో అభివృద్ధి చెందిందని, తమకు ఉపాధి గణనీయంగా పెరిగిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. పదిరోజులు కాకముందే ఉగ్రదాడితో పరిస్థితి మారిపోయింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడమేకాదు.. కశ్మీర్‌ పట్ల నెలకొన్న భయానక వాతావరణాన్ని తొలగించాల్సిన బాధ్యత మనపై ఉందని టీడీపీ తరఫున అఖిలపక్షంలో వివరించాను. ఉగ్రదాడి జరిగిన బైసరన్‌ వద్ద నెలన్నర తర్వాత పర్యాటకాన్ని ప్రారంభించనున్నారు. కానీ ఇంతలోనే ఎటువంటి సమాచారం లేకుండానే, కొందరు అక్కడికి టూరిస్టులను తీసుకెళ్లారు. సమాచార లోపంతో సమస్య తలెత్తింది. ఏదేమైనా ఉగ్రదాడి బాధాకరం’’ అని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కాగా, ఉగ్రవాదాన్ని తుద ముట్టించడంలో కేంద్రానికి అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తామని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదంపై యుద్ధం జరగాలన్నారు.


భద్రతా వైఫల్యం నిజమే!?

పహల్గాం ఉగ్రదాడి వెనుక భద్రతా వైఫల్యం కూడా ఉందని అఖిలపక్ష భేటీలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల పత్రిక ఇండియా టుడే ఈ వివరాలను వెల్లడించింది. బైసరన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు ఎందుకు లేవని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించగా.. ‘‘అక్కడ ఎలాంటి తప్పూ జరగకపోతే.. మనం ఇక్కడ ఎందుకు భేటీ అవుతాం. ఏవో అంశాల్లో వైఫల్యం జరిగింది. అదేమిటో తేల్చాల్సి ఉంది. అమర్‌నాథ్‌ యాత్ర మొదలయ్యే వరకు కూడా బైసరన్‌ ప్రాంతంలో నిషేధం ఉంటుంది. కానీ స్థానిక అధికారులు భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వకుండానే.. పర్యాటకులను అనుమతించారు.’’ అని ఈ భేటీలో ప్రభుత్వం తరఫున పాల్గొన్న నేత వెల్లడించినట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 04:49 AM