Parliament Monsoon Session: 22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
ABN , Publish Date - Jul 28 , 2025 | 02:59 PM
పాకిస్థాన్‌లోని పలు వైమానిక కేంద్రాలపై భారత వాయిసేన భీకరంగా విరుచుకుపడటంతో పాకిస్థాన్ ఓటమిని అంగీకరించి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌కు విరామం ఇచ్చేందుకు కేవియట్‌తో ఆమోదించామని తెలిపారు.

న్యూఢిల్లీ: భారత సైన్యం సత్తాకు 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) నిదర్శనమని, మన వీరజవాన్ల పాత్ర వెలకట్ట లేనిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి మన సత్తా చాటామని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో సోమవారంనాడు ప్రత్యేక చర్చను రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మిలటరీ యాక్షన్ చేపట్టింది. దీనిపై ప్రత్యేక చర్చలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటూ, కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశామని చెప్పారు.
పహల్గాం దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని రాజ్‌నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతిగా పాక్ ఉగ్రవాద స్థావరాలపై వ్యూహాత్మకంగా దాడి చేశామని, 9 ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిందని సభకు తెలిపారు. పాక్‌లో సామాన్యులకు ఇబ్బంది లేకుండా దాడులు చేశామన్నారు. సిందూర్ అనేది వీరత్యం, శౌర్యానికి ప్రతీక అని అభివర్ణించారు. ఉగ్రవాద శిబిరాలు, వారి మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని వారిని మట్టుబెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టామని అన్నారు. ఆత్మరక్షణ కోసమే సైనిక చర్య తీసుకున్నామని, రెచ్చగొట్టడానికో, విస్తరణవాదంతోనే కాదన్నారు. 2025 మే 10వ తేదీని మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు కూడా ఇండియాపై క్షిపణలు, డ్రోన్లు, రాకెట్లు, ఇతర సుదీర్ఘ శ్రేణి ఆయుధాలపై దాడులకు పాక్ తెగబడిందని చెప్పారు ఎస్-400, ఆకాశ్ మిజైల్ సిస్టమ్ పూర్తిగా పాక్ దాడులను విఫలం చేశాయని అన్నారు.
పాక్ ఓటమిని అంగీకరించింది
పాకిస్థాన్‌లోని పలు వైమానిక కేంద్రాలపై భారత వాయిసేన భీకరంగా విరుచుకుపడటంతో పాకిస్థాన్ ఓటమిని అంగీకరించి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌కు విరామం ఇచ్చేందుకు కేవియట్‌తో ఆమోదించామని తెలిపారు. భవిష్యత్తులో పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ఆపరేషన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.
ఎలాంటి ఒత్తిడి లేదు
ముందుగా నిర్ణయించిన రాజకీయ, మిలటరీ లక్ష్యాలు నెరవేరడంతో ఆపరేషన్ సింధూర్‌కు విరామం ఇచ్చిందని, ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామనేదే పూర్తిగా తప్పని వివరించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా ఉండేందుకే తాను ప్రయత్నించానని చెప్పారు.
విమానాల కూల్చివేతపై..
ఆపరేషన్ సిందూర్‌లో ఎన్ని విమానాలు కూలిపోయాయంటూ కొందరు విపక్ష సభ్యులు ప్రశ్నించారని, అయితే ఆ ప్రశ్న మన జాతీయ భావోద్వోగాలకు ప్రతిబింబించేదిగా లేదని తాను భావిస్తున్నానని రాజ్‌నాథ్ చెప్పారు. ఎన్ని శత్రు విమానాలను కూల్చేశారని మాత్రం విపక్షాలు ప్రశ్నించ లేదన్నారు. ఉగ్రవాద శిబిరాలను కూల్చేశారా అని తప్పనిసరిగా వాళ్లు ప్రశ్నించి ఉంటే దానికి అవునన్నదే తన సమాధానమని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందా అని అడగవచ్చని, అందుకు అవునన్నదే తన సమధానమని అన్నారు. మన సాహస జవాన్లు ఎవరైనా మరణించారా అని అడిగితే లేదన్నదే తన సమాధానమని అన్నారు. మన సైనికులెవ్వరికీ ఎలాంటి హాని జరగలేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. పహల్గామ్ ఉగ్రవాదులు హతం..!
ఆపరేషన్ సిందూర్ చర్చపై శశి థరూర్ దూరం ఎందుకు?
For More National News and Telugu News..