Share News

పహల్గామ్ నిందితులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు అరెస్ట్..

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:49 AM

Pahalgam terror attack: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి సహకరించిన ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది.

పహల్గామ్ నిందితులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు అరెస్ట్..
NIA Arrests Two in Pahalgam Terror Attack Case

NIA Arrests Pahalgam terror attack: ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పహల్గామ్‌ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ దారుణ మారణకాండలో పాల్గొన్న ఉగ్రవాదుల జాడ కనిపెట్టేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా, ఈ దాడికి కారకులైన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి అమానుష చర్యలకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను ఆదివారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది.


నిందితులు పహల్గామ్‌లోని బాట్‌కోట్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, హిల్ పార్క్‌కు చెందిన బషీర్ అహ్మద్ జోథర్‌గా NIA గుర్తించింది. వీరిద్దరూ పాకిస్థాన్ కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆహారం, రవాణా వంటి అవసరాలు తీర్చి బైసరన్ లోయలో మారణకాండకు సహకరించినట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితులు పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లు వెల్లడించడంతో కేసులో కీలక పురోగతి సాధించినట్లయింది. ఈ కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఇప్పటివరకూ 2000ల మందికిపైగా సాక్షులను విచారించారు.


NIA ప్రకారం, అరెస్టయిన పర్వీజ్, బషీర్‌ పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు సాయుధ ఉగ్రవాదుల పేర్లను వెల్లడించారు. వారంతా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) కోసం పనిచేస్తున్న పాక్ దేశీయులు. దాడికి ముందు నిందితులు ముగ్గురు ఉగ్రవాదులకు హిల్ పార్క్‌లోని సీజనల్ ధోక్ (గుడిసె)లో ఆశ్రయం కల్పించారు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘోర విషాదంపై ఇంకా దర్యాప్తులు కొనసాగుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉగ్రవాదులకు ఝలక్ ఇచ్చిన జమ్మూ కశ్మీర్‌ పోలీసులు

ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఝలక్

For National News And Telugu News

Updated Date - Jun 22 , 2025 | 12:57 PM