National Herald case: సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ
ABN , Publish Date - Jul 02 , 2025 | 03:46 PM
స్వాతంత్య్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ.. తన భావాలను ప్రతిబింబించే విధంగా ఒక పత్రికను ప్రారంభించాలని భావించింది. ఈ ఉద్దేశ్యంతో 1938లో ది నేషనల్ హెరాల్డ్ పత్రికను జవహర్ లాల్ నెహ్రు ప్రారంభించారు. దీనికి అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ప్రచురణకర్తగా వ్యవహరించింది.

న్యూఢిల్లీ, జులై 02: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా, రాహుల్ గాంధీలకు సంబంధమున్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. బుధవారం న్యూఢిల్లీ కోర్టులో ఈడీ తరఫు న్యాయవాది అదనపు సోలిసిటర్ జనరల్ వి. రాజు తన వాదనలు వినిపించారు. చాలా ఏళ్లుగా వీరు మోసపూరితంగా ఇలా అద్దె చెల్లించారన్నారు.
అందుకు సంబంధించిన రశీదులను వీరు తయారు చేశారని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతల సూచనల మేరకే ఈ నగదును వీరు ఇలా ఏజేఎల్‌కు బదిలీ చేశారని కోర్టుకు విన్నవించారు. ఇదే తరహాలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సూచనల మేరకు అడ్వర్టైజ్‌మెంట్ నిధులు సైతం దారి మళ్లించారని వివరించారు. ఇటువంటి మోసపూరిత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం నేరమని ఈడీ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు స్పష్టం చేశారు.
ఇక ఈ కేసులో దాతలను సైతం ఈడీ ఇప్పటికే ప్రశ్నించిందని గుర్తు చేశారు. అలాగే సీనియర్ నేతలను సైతం విచారించిందని చెప్పారు. అలాగే షేర్ల బదిలీపై ప్రశ్నించాల్సి ఉందన్నారు. సుమన్ దుబే షేర్లను సోనియా గాంధీకి, ఆస్కార్ ఫెర్నాండేజ్ షేర్లను రాహుల్ గాంధీకి బదిలీ చేశారన్నారు. కానీ ఆ తర్వాత ఈ షేర్లను ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు తిరిగి బదిలీ చేశారని సోదాహరణగా కోర్టుకు ఆయన వివరించారు. ఇవన్నీ నకిలీ లావాదేవీలని న్యాయవాది వి రాజు ఈ సందర్బంగా పేర్కొన్నారు. అయితే 2015 వరకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందారని.. వారిద్దరు సోనియా, రాహుల్ గాంధీలు మాత్రమేనని కోర్టుకు న్యాయవాది వి. రాజు తెలిపారు.
స్వాతంత్య్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ.. తన భావాలను ప్రతిబింబించే విధంగా ఒక పత్రికను ప్రారంభించాలని భావించింది. ఈ ఉద్దేశ్యంతో 1938లో ది నేషనల్ హెరాల్డ్ పత్రికను జవహర్ లాల్ నెహ్రు ప్రారంభించారు. దీనికి అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ప్రచురణకర్తగా వ్యవహరించింది. దీంతో స్వాతంత్య్రానికి పూర్వం ఈ పత్రిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైందిగా మారింది. ఈ పత్రిక ఆంగ్లంలోనే కాకుండా.. హిందీ, ఉర్దు భాషల్లో సైతం వెలువడేది.
అయితే 2008లో రూ. 90 కోట్ల మేర అప్పుల కారణంగా.. ఈ పత్రిక మూతపడింది. అంతేకాకుండా.. ఈ పత్రిక ఆస్తులపై వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 2012లో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యన్ స్వామి.. ట్రయల్ కోర్టులో ఈ పత్రికపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు ఇతరులు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)ను స్వాధీనం చేసుకున్నారని.. తద్వారా దీని నుంచి రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా వారు పొందారని ఆరోపించారు.
ఆ క్రమంలో సోనియా, రాహుల్, శ్యామ్ పిట్రోడా, సుమన్ దూబే తదితరులపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అంతేకాదు.. యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్‌షీట్‌లో ఈడీ స్పష్టం చేసిన విషయం విదితమే.
ఇవి కూడా చదవండి..
నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. నిందితులకు బెయిల్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి