MCD Bypolls 2025: ఎంసీడీలోని 12 వార్డులకు ఉప ఎన్నిక పూర్తి.. ఫలితాలు డిసెంబర్ 3న
ABN , Publish Date - Nov 30 , 2025 | 07:27 PM
ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం, తాజాగా ఎంసీడీలోని 12 వార్డులకు ఉపఎన్నికలు జరగడంతో ప్రజలు ఏపార్టీని ఆదరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD)లోని 12 వార్డులకు ఆదివారంనాడు జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. 143 పోలింగ్ స్టేషన్లలోని 580 బూత్‌లలో పోలింగ్ జరిగింది. ఉదయం 7.30 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్ర 5.30 గంటలకు ముగిసింది. 31.3 శాతం పోలింగ్ నమోదైంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం, తాజాగా ఎంసీడీలోని 12 వార్డులకు ఉపఎన్నికలు జరగడంతో ప్రజలు ఏపార్టీని ఆదరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌పై బీజేపీ విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎంసీడీ ఉప ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, ఆప్ మధ్యనే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సైతం తిరిగి పట్టు సాధించాలని ఆశిస్తోంది. ఈ ఎన్నికల్లో 26 మంది మహిళలతో సహా 51 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ అత్యధికంగా 8 మంది మహిళా అభ్యర్థులను పోటీలోకి దింపగా, ఆప్ ఆరుగురు మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ నుంచి 5 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
కాగా, ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 10 కౌంటింగ్ సెంటర్లలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. డిసెంబర్ 3న కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి..
సోనియా నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీ
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి