Rahul Gandhi: ఆర్మీపై వ్యాఖ్యల కేసులో రాహుల్‌గాంధీకి బెయిల్
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:30 PM
రాహుల్ మంగళవారంనాడు కోర్టు ముందు హాజరుకాగా, గతంలో ఐదు పర్యాయాలు ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. 2020లో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణల సమయంలో భారత సైనికుల మనోభావాలను దెబ్బతీసేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ ఈ పిటిషన్ వేశారు.

లక్నో: ఇండియన్ ఆర్మీపై పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారన్న కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఊరట లభించింది. ఆయనకు ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు మంగళవారంనాడు బెయిలు మంజూరు చేసింది. రూ.20,000 వ్యక్తిగత పూచీకత్తు, రెండు ష్యూరిటీలు సమర్పించాలని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అలోక్ వర్మ ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేశారు.
రాహుల్ మంగళవారంనాడు కోర్టు ముందు హాజరుకాగా, గతంలో ఐదు పర్యాయాలు ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. 2020లో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణల సమయంలో భారత సైనికుల మనోభావాలను దెబ్బతీసేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ ఈ పిటిషన్ వేశారు. భారత్ జోడో యాత్ర సమయంలో సరిహద్దుల్లోని పరిస్థితిని రాహుల్ ప్రస్తావిస్తూ, అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను 'కొడుతుంటే' మీడియా ఎలాంటి ప్రశ్నలు వేయడం లేదని అన్నట్టు పిటిషనర్ పేర్కొన్నారు. భారత సైనికుల మనోభావాలను రాహుల్ దెబ్బతీశారని ఆరోపించారు.
విచారణకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి ఉదయం చేరుకున్నప్పుడు ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన కోర్టుకు హాజరయ్యారు. సుమారు గంట సేపు కోర్టులో ఉన్నారు. లక్నో హైకోర్టు తనకు జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని రాహుల్ చేసిన విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు ఇంతకుముందు కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి..
రాహుల్ ప్రధాని అవుతాడని మీకు తెలుసా.. పిటిషనర్‌పై ముంబై హైకోర్టు ఆగ్రహం
ముంబై పేలుళ్లను సంజయ్ దత్ ఆపగలిగేవాడు: ఉజ్వల్ నికమ్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి