Share News

Justice Yashwant Varma Case: జస్టిస్ యశ్వంత్ వర్మా కేసు.. సుప్రీంకోర్టు చర్యలు వివాదాస్పదం

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:41 PM

దేశంలో న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం ఉంది. ఇది స్వతంత్రంగా, న్యాయంగా పనిచేస్తుందని అందరూ నమ్ముతారు. కానీ ఇటీవల ఢిల్లీలో ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో భారీ మొత్తంలో నగదు లభ్యమైన కేసులో తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Justice Yashwant Varma Case: జస్టిస్ యశ్వంత్ వర్మా కేసు.. సుప్రీంకోర్టు చర్యలు వివాదాస్పదం
Justice Yashwant Varma Case

దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తుందని అందరూ భావిస్తారు. కానీ, ఢిల్లీలోని ఓ హైకోర్టు జడ్జి నివాసంలో భారీ మొత్తంలో నగదు లభ్యమైన ఘటన (Justice Yashwant Varma Case) కేసు తీర్పు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మా సుప్రీంకోర్టు (Supreme Court) చర్యలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‎గా మారింది.


ఏం జరిగింది..

జస్టిస్ యశ్వంత్ వర్మా ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో, ఆయన నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా ఆయన ఇంటిలో భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఈ ఘటన అనేక అనుమానాలకు, అవినీతి ఆరోపణలకు దారితీసింది. దీని పర్యవసానంగా, జస్టిస్ వర్మాను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ ఆరోపణలను పరిశీలించడానికి ముగ్గురు న్యాయమూర్తులతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ నివేదిక ఆధారంగా జస్టిస్ వర్మాను తొలగించాలని సిఫార్సు చేశారు.


సుప్రీంకోర్టులో పిటిషన్

జస్టిస్ వర్మా ఈ సిఫార్సును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో భారతదేశ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ దాఖలు చేసిన తీరును తప్పుబట్టింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ దాఖలు చేయకూడదని తెలిపింది. మీ ప్రధాన సమస్య సుప్రీంకోర్టుతోనే ఉందని తెలిపింది. అలాగే, ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ నివేదికను పిటిషన్‌తో జతచేయకపోవడంపై కూడా జస్టిస్ దత్తా అసంతృప్తి వ్యక్తం చేశారు.


కపిల్ సిబల్ వాదనలు

ఈ కేసులో జస్టిస్ వర్మా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. రాజ్యాంగంలో న్యాయమూర్తిని తొలగించేందుకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని, ఆ నిబంధనల ప్రకారం న్యాయమూర్తి తప్పిదం నిరూపితం కాకముందే ఆయనపై చర్చ జరపడం సరికాదని వాదించారు. రాజ్యాంగం ప్రకారం, న్యాయమూర్తి తప్పిదం నిరూపితం కాకుండా పార్లమెంటులో కూడా చర్చించడం నిషేధమన్నారు.

రాజ్యాంగ విరుద్ధమని..

అలాంటప్పుడు, ఈ విధంగా బహిరంగంగా చర్చలు, మీడియా ఆరోపణలు, న్యాయమూర్తులపై విమర్శలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సిబల్ పేర్కొన్నారు. అలాగే, నగదు జస్టిస్ వర్మా ఇంటిలోని అవుట్‌హౌస్‌లో లభ్యమైందని, అది జడ్జికి చెందినదని ఎలా నిర్ధారించగలమని ప్రశ్నించారు. దీనికి జస్టిస్ దత్తా, పోలీసులు, ఎఫ్‌ఐఆర్, సిబ్బంది అంతా అక్కడ ఉన్నారు, నగదు లభ్యమైందని సమాధానమిచ్చారు. సిబల్ మాత్రం, జడ్జి సిబ్బంది అక్కడ లేరని, ప్యానెల్ నివేదిక విశ్వసనీయం కాదని వాదించారు.


జస్టిస్ వర్మా వాదన

జస్టిస్ వర్మా తన పిటిషన్‌లో సుప్రీంకోర్టు ప్యానెల్ తన వాదనను సరిగ్గా వినలేదని పేర్కొన్నారు. న్యాయమూర్తిని తొలగించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని, సుప్రీంకోర్టు ఈ విషయంలో సిఫార్సు చేయడం రాజ్యాంగంలోని అధికార విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమేనని ఆయన వాదించారు. న్యాయవ్యవస్థ పార్లమెంటు అధికారాలను స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ఆయన తన పిటిషన్‌లో స్పష్టం చేశారు.

తదుపరి విచారణ

ఈ కేసు తదుపరి విచారణ బుధవారం జరగనుంది. ఈ కేసు నేపథ్యంలో దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ నిబంధనలు, న్యాయమూర్తుల తొలగింపు వంటి అనేక కీలక అంశాలను లేవనెత్తింది. ఈ వ్యవహారం భవిష్యత్తులో న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని, రాజ్యాంగ సమతుల్యతను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 01:46 PM