Jai Shankar: కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
ABN , Publish Date - Jul 28 , 2025 | 08:10 PM
అమెరికా మధ్యవర్తిత్వంపై వస్తున్న ఊహాగానాలను జైశంకర్ కొట్టివేశారు. ఏప్రిల్ 22 జూన్ 17 మధ్య ప్రధానమంత్రి మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణలు జరగలేదని సభకు వివరించారు.

న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం ఎంతమాత్రం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) తెలిపారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై లోక్‌సభలో సోమవారం ప్రత్యేక చర్చలో జైశంకర్ మాట్లాడారు. కాల్పుల విరమణకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని ఈ సందర్భంగా కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. అమెరికా మధ్యవర్తిత్వంపై వస్తున్న ఊహాగానాలను కొట్టివేశారు. ఏప్రిల్ 22- జూన్ 17 మధ్య ప్రధానమంత్రి మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణలు జరగలేదని సభకు వివరించారు. భారత్-పాక్ మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ అనంతరమే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చినట్టు చెప్పారు. ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
డీజీఎంఓలు మాట్లాడుకోవాల్సిందే..
పాకిస్థాన్ కాల్పులపై భారత్ విరుచుకుపడటంతో కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామంటూ పాక్ నుంచి భారత ప్రభుత్వానికి ఫోన్ కాల్స్ వచ్చాయని, అయితే ప్రొటోకాల్ ప్రకారం ఇలాంటి సమాచారం అధికారికంగా పాకిస్థాన్ డీజీఎంఓ నుంచి రావాలని ఇండియా పట్టుపట్టిందని జైశంకర్ సభకు తెలిపారు.
లష్కరే తొయిబా ప్రాక్సీ అయిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడం వెనుక భారత దౌత్యానికి క్రెడిట్ దక్కుతుందని జైశంకర్ అన్నారు. ఉగ్రవాదానికి చిరకాలంగా పాకిస్థాన్ మద్దతిస్తున్న విషయాన్ని ఇండియా బలంగా ప్రపంచ దేశాల ముందుకు తీసుకువెళ్లిందన్నారు. ప్రపంచానికి పాకిస్థాన్ నిజస్వరూపం వెల్లడించడంలో సక్సెస్ అయ్యామని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదనే విధానాన్ని ఇండియా అనుసరిస్తోందన్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరు కేవలం ఆపరేషన్ సిందూర్‌కు పరిమితం కాదని.. దేశ ప్రజలు, వారి ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు. జాతీయ భద్రతపై భారత్ దృఢ వైఖరి కొనసాగిస్తోందని, పాకిస్థాన్ జాతీయులకు వీసా ఆంక్షలు కొనసాగుతాయని వివరించారు. ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు అనుసరిస్తున్న విస్తృత వ్యూహంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..