Share News

Parliament Session: పాక్ బరితెగిస్తే మళ్లీ భరతం పడతాం: రాజ్‌నాథ్

ABN , Publish Date - Jul 29 , 2025 | 09:07 PM

ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం కేవలం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదని, ఉగ్రవాదాన్ని భారత్ ఎంత మాత్రం సహించదనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు.

Parliament Session: పాక్ బరితెగిస్తే మళ్లీ భరతం పడతాం: రాజ్‌నాథ్
Rajnath singh

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మరోసారి దుస్సహసానికి ఒడిగడితే ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను తిరిగి ప్రారంభించేందుకు భారత్ వెనుకాడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తెలిపారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. భారత బలగాలు ఆపరేషన్ సిందూర్‌లో కేవలం పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలను టార్గెట్‌గా చేసుకుని నేలమట్టం చేశాయని, పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరగనీయలేదని చెప్పారు.


పహల్గాం ముష్కరులను ముగ్గురిని మట్టుబెట్టాం

ఏప్రిల్ 22వ తేదీన 26 మంది అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు విజయవంతంగా మట్టుబెట్టాయని రాజ్‌నాథ్ తెలిపారు. భారతదేశ అంతర్గత, బహిర్గత భద్రతను కాపాడటంలో ఇండియన్ ఆర్మీ, ఇతర భద్రతా దళాల పాత్ర ఎంత చెప్పినా తక్కువేనని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ పాత్రను కేవలం ఇప్పటి సందర్భంగా చూడకూడదని, భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎంతో కీలకమని చెప్పారు.


ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదనేది భారత్ నిశ్చితాభిప్రాయమని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం కేవలం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమే మాత్రమే కాదని, ఉగ్రవాదాన్ని భారత్ ఎంత మాత్రం సహించదనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చిందని వివరించారు. భారత భవిష్యత్తు పరిరక్షించేందుకు ఉద్దేశించినదే ఆపరేషన్ సిందూర్ అని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో పాక్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులు, సానుభూతిపరులను హతం చేశామని చెప్పారు. ఇండియన్ ఆర్మీ అన్ని దాడులను నిలిపివేసినందున పాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌లోని ఏ లక్ష్యాలపైనా దాడి చేయరాదని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

జాతీయ భద్రతపై పరిహాసమా.. విపక్షాలపై మోదీ ఫైర్..

కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 29 , 2025 | 09:33 PM