Dalai Lama: వారసుడి ఎంపికలో దలైలామాకే పూర్తి హక్కు: భారత్ స్పష్టం!
ABN , Publish Date - Jul 03 , 2025 | 02:23 PM
India on Dalai Lama Successor: దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా (China)కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. దలైలామా (Dalai Lama)కు మాత్రమే తన వారసుడిని ఎంచుకునే హక్కు ఉంటుందని గురువారం ఓ ప్రకటనలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పష్టం చేశారు.

India snubs China Dalai Lama Successor: టిబెటన్ బౌద్ధమత గురువు దలైలామా (Dalai Lama) వారసుడి ఎంపికలో చైనా (China) జోక్యం చేసుకోవడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. మేము ఆమోదించిన వ్యక్తే ఆయన తదుపరి వారసుడిగా ఉంటాడని బీజింగ్ వాదిస్తుండటంపై గురువారం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఘాటుగా స్పందించారు. చైనా జోక్యాన్ని ఖండిస్తూ టిబెటన్ ఆధ్యాత్మిక సంప్రదాయాలు వారి అంతర్గత విషయమని పేర్కొన్నారు. తన వారసుడు ఎవరని నిర్ణయించుకునే హక్కు కేవలం దలైలామాకు మాత్రమే ఉంటుందని.. మరెవరికీ లేదని ఓ అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.
15వ దలైలామాను బీజింగ్ ఎంపిక చేస్తుందని చైనా ప్రకటించడంపై భారతదేశం గురువారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడికి మాత్రమే తన వారసుడిని నిర్ణయించే అధికారం ఉంటుందని పేర్కొంది. 'దలైలామా స్థానం కేవలం టిబెటన్లకు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఆయన అనుసరిస్తున్న లక్షలాది మందికి అతిముఖ్యమైన విషయం. తన వారసుడిని ఎంచుకునే నిర్ణయం దలైలామాదే' అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
వారసుడిని ఎవరు నిర్ణయిస్తారు?
అంతకుముందే టిబెటన్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా వైఖరిని తిరస్కరించారు. 600 ఏళ్లుగా అనుసరిస్తున్న సంప్రదాయాల ప్రకారమే.. 15వ దలైలామా ఎంపిక విషయంలో 'గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్' తుది నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. ఇందులో ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని కుండబద్ధలు కొట్టారు. అలాగే, ఈసారి కచ్చితంగా చైనా వెలుపలి ప్రపంచంలోనే తన వారసుడు జన్మిస్తారని అన్నారు. బీజింగ్ ఎన్నుకున్న వ్యక్తి ఎట్టిపరిస్థితుల్లో దలైలామా కాబోడని.. వారిని ప్రపంచం తిరస్కరించాలని సూచించారు.
టిబెట్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు దలైలామాను తామే ఎంపిక చేయాలని చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం టిబెట్ తమ అధీనంలోనే ఉంది కాబట్టి.. దలైలామా, పాంచెన్ లామా వంటి ఆధ్యాత్మిక గురువుల ఎంపిక తప్పనిసరిగా చైనా ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలని బీజింగ్ వాదిస్తోంది. 18వ శతాబ్దంలో చింగ్ వంశాధిపతి ప్రవేశపెట్టిన 'గోల్డెన్ అర్న్' పద్ధతి ప్రకారమే 15వ దలైలామా ఎంపిక జరుగుతుందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ ప్రకటించారు. తమ దేశం మతపరమైన స్వేచ్ఛకు కట్టుబడి ఉంటుందంటూనే మత సంబంధిత వ్యవహారాలు, బౌద్ధమత గురువుల ఎన్నుకునే హక్కు పూర్తిగా తమదేనని డ్రాగన్ అంటోంది.
టిబెట్ క్వింఘై ప్రావిన్స్‌లోని ఒక రైతు కుటుంబంలో జూలై 6, 1935న జన్మించిన టెన్జిన్ గ్యాట్సో రెండేళ్ల వయసులో ఉండగా 14వ దలైలామా తన వారసుడిగా గుర్తించారు. అయితే, 1950లో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ సారథ్యంలోని సైనిక దళాలు టిబెట్‌ను ఆక్రమించుకున్నాయి. కాగా, 1959లో చైనా పాలనకు వ్యతిరేకంగా టిబెట్ దైవభూమి లాసాలో జరిగిన తిరుగుబాటు విఫలమైంది. దీంతో 23 ఏళ్ల వయసులో దలైలామా 1000 మంది బౌద్ధ అనుచరులతో భారత్‌కు శరణార్థిగా తరలివచ్చారు. అప్పటి నుంచి ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక, దలైలామాను ప్రపంచవ్యాప్తంగా శాంతి, కరుణకు చిహ్నంగా భావిస్తారు. కానీ, చైనా మాత్రం టిబెట్‌ను తమ దేశం నుంచి వేరు చేయాలనుకునే 'వేర్పాటువాది' అని పిలుస్తుంది. 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించిన నాటి నుంచి స్వతంత్ర టిబెట్ కోసం దలైలామా పోరాడుతుండటమే అందుకు కారణం.
కాగా, ప్రస్తుతం ధర్మశాలలో దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మెక్లియోడ్‌గంజ్‌లోని ప్రధాన ఆలయమైన సుగ్లగ్‌ఖాంగ్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు భారత ప్రభుత్వం తరపున హాజయ్యారు. ఈ సందర్భంగానే 15వ దలైలామా ఎంపికపై నడుస్తున్న చర్చలకు ఆయన బదులిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి.
12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!
రేవంత్.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్!
Read Latest Telangana News and National News