India: బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్..
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:40 PM
India: పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి తీవ్ర ఆందోళనలు చెలరేగడంతో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలపై బంగ్లాకు చెందిన ఓ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని ఖండిస్తూ భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది.

India: పశ్చిమ బెంగాల్(west bengal)లో జరుగుతున్న పరిణామాలపై బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను భారతదేశం తిరస్కరించింది. వక్ఫ్ చట్టాన్ని(Waqf Act) వ్యతిరేకిస్తూ ఈ మధ్య పశ్చిమ బెంగాల్‌లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు దారితీసింది. దీనిపై బంగ్లాదేశ్ (Bangladeshi) అధికారి మీడియాతో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై తాజాగా భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ "పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సంఘటనలకు సంబంధించి ఢాకా చేసిన వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నాము. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న వేధింపులపై భారతదేశం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు కప్పిపుచ్చేందుకు ఢాకా కపట ప్రయత్నాలు చేస్తోంది. అనవసరమైన వ్యాఖ్యలు చేయడం మాని బంగ్లాదేశ్ తమ దేశంలో సొంత మైనారిటీల హక్కులను కాపాడుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది" అని హితవు పలికారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఇస్లాం ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, బెంగాల్‌లో జరిగిన హింసలో ముగ్గురు ముస్లిం సోదరులు ప్రాణాలు కోల్పోవడం, ఆస్తి నష్టం కలిగించేలా దాడులు జరగడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సంఘటనలో బంగ్లాదేశ్‌ను ఇరికించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాన్ని ఢాకా తీవ్రంగా నిరసిస్తోందని అన్నారు. ఇండియాలో మైనారిటీలుగా ముస్లిం ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన న్యూఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సమాజం నిరసనలు వ్యక్తం చేసిన సమయంలో ముర్షిదాబాద్‌తో సహా పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు గత కొన్ని రోజులుగా మతపరమైన హింసను చవిచూశాయి.
Read Also: Maharashtra: అప్పుడు అందరికీ బట్టతల వైరస్.. ఇప్పుడు ఇంకోటి.. వరస మిస్టరీ వైరస్‌లకు కారణమేంటి..
EPS: తేల్చేశారు.. ఆ పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వబోం..
PM Modi-Elon Musk: ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ