IAS Ashok Khemka: 34 ఏళ్లలో 57 సార్లు ట్రాన్స్ఫర్.. ముగిసిన పోరాటం.. సీనియర్ ఐఏఎస్ ఖేమ్కా పదవీ విరమణ..
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:53 AM
Who is Ashok Khemka: ఇండియాలో అత్యధికంగా ట్రాన్స్ఫర్ అయిన ఐఏఎస్‌గా గుర్తింపు తెచ్చుకున్న 1991 బ్యాచ్ అధికారి అశోక్ ఖేమ్కా హర్యానా రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.

IAS Ashok Khemka Retirement: అధికార నేతలు చెప్పినదానికల్లా తలాడిస్తూ 'అయ్యా'ఎస్ అనిపించుకుని జైళ్లపాలయిన సివిల్ సర్వీసెస్ అధికారులు ఎందరినో ప్రజలు చూసే ఉంటారు. కానీ, 34 ఏళ్లుగా అవినీతిపై అలుపెరుగని పోరాటం చేసిన ఒక ఐఏఎస్ ఉన్నారని చాలా తక్కువ మందికే తెలుసు. ఆయనే హర్యానాలో రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న అశోక్ ఖేమ్కా. నిజాయితీగా ఉన్నందుకు ఆయనకు దక్కిన గౌరవం.. ఇండియాలో అత్యధిక సార్లు ట్రాన్స్ఫర్ అయిన ఐఏఎస్ అనే ట్యాగ్. ఈ పేరుతోనే దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఖేమ్కాను ఏప్రిల్ 30 తర్వాత ఇంకెవ్వరూ ట్రాన్స్ఫర్ చేయలేరు. ఎందుకంటే, ఈ రోజే ఆయన సర్వీసులో ఆఖరిరోజు మరి.
1991 బ్యాచ్ అధికారి అయిన అశోక్ ఖేమ్కా హర్యానా కేడర్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఇదే శాఖలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన 4 నెలలకే బదిలీ అయ్యారు. 34 ఏళ్ల సర్వీసులో ఏకంగా 57 సార్లు ట్రాన్స్ఫర్ అయిన ఆయన దేశంలో అత్యధిక సార్లు బదిలీ అయిన ఐఏఎస్‌గా గుర్తింపు పొందారు. 2012లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆయన పేరు తొలిసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ లో వాద్రాకు చెందిన భూమి మ్యుటేషన్ ను ఖేమ్కా అడ్డుకున్నారు. ఇది యాజమాన్య హక్కులను బదిలీ చేసే ప్రక్రియలో ఒక భాగం. దీంతో అప్పటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీనే ధిక్కరించిన ఐఏఎస్ అధికారిగా వార్తల్లోకెక్కారు.
అశోక్ ఖేమ్కాది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా. అక్కడే పుట్టి పెరిగిన ఆయన 1988లో ఐఐటి ఖరగ్‌పూర్ నుంచి సీఎస్ఈలో బీటెక్ చేశారు. తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చీ (TIFR)లో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ చేశారు. చదువుపై మక్కువతో తర్వాతి రోజుల్లో ఎంబీఏ, ఎల్ఎల్బీ కూడా పూర్తి చేశారు. ఇక ఐఏఎస్ గా ఎంపికైన నాటి నుంచి ఖేమ్కా ఏ పోస్టులోనూ సగటున 6 నెలలకు మించి పనిచేయలేదు. ముక్కుసూటితనం, నేతల అడుగులకు మడుగులొత్తక ఎదిరించి మాట్లాడే స్వభావం వల్ల జీవితాంతం ప్రాధాన్యత లేని శాఖల్లోనే పనిచేయాల్సి వచ్చింది. కెరీర్ చివరి దశలో అవినీతి నిర్మూలనకు రాష్ట్ర నిఘా (స్టేట్ విజిలెన్స్) విభాగం అధిపతిగా అవకాశం ఇవ్వాలని హర్యానా ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం దక్కలేదు. తన బ్యాచ్ వారంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. అశోక్ ఖేమ్కా మాత్రం జీవితాంతం బదిలీ ఆర్డర్లు అందుకోవడంతోనే గడిపేశారు. నచ్చిన విభాగంలో ప్రజలకు సేవలందించే అవకాశం ఏనాడూ రాలేదు.
Read Also: EPS: సీఎంపై మాజీసీఎం ధ్వజం.. ఇప్పుడు చేసిందే చాలు.. ప్రగల్భాలు వద్దు
India Vs Pak: కవ్విస్తున్న పాక్.. యుద్ధం తప్పదా..
Pahalgam Terror Attack: ఎమ్మెల్యేతో సహా 30 మంది అరెస్ట్