Honeymoon in Shillong: మేఘాలయ హనీమూన్ ట్రిప్ రాజా రఘువంశీ నిజ జీవితం ఆధారంగా మూవీ
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:32 AM
పెళ్లైన ఓ కొత్త జంట హనీమూన్ ట్రిప్‌కు మేఘాలయ వెళ్లిన విషాద ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో చనిపోయిన రాజా రఘువంశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు ఇదే అంశంపై ఓ సినిమా రాబోతుంది.

ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హనీమూన్ సందర్భంగా మేఘాలయకు వెళ్లి, చనిపోయిన ఘటన ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఈ విషయం గురించి కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఘటన ఆధారంగా ఏకంగా సినిమా తీస్తున్నారు(Honeymoon in Shillong movie). హనీమూన్ ఇన్ శిలాంగ్ అనే పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఎస్పీ నింబావత్ దర్శకత్వం వహిస్తున్నారు.
కుటుంబ సభ్యుల అనుమతి
రాజా కుటుంబ సభ్యులు ముఖ్యంగా అతని అన్నలు సచిన్, విపిన్ రఘువంశీలు ఈ చిత్రానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. నిజం ఏంటి, ద్రోహం చేసింది ఎవరనే విషయం ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. అందుకే దీనిని సినిమా రూపంలో తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు సచిన్ స్పష్టం చేశారు.
విపిన్ రఘువంశీ ఏమన్నారంటే..
మేఘాలయ గురించి కూడా ప్రజల్లో పడిన అభిప్రాయం మారాలంటే సినిమా ద్వారా నిజాన్ని చూపించాలన్నారు. ఈ ప్రాంతం చాలా అందమైనదని, కానీ ఇక్కడ జరిగిన ఓ ఘటనకు మేఘాలయను దోషిగా చూపకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
దర్శకుడి స్పందన
రాజా రఘువంశీ తన జీవిత భాగస్వామి చేతిలో పెద్ద ద్రోహాన్ని ఎదుర్కొన్నట్లు దర్శకుడు నింబావత్ అన్నారు. ఈ నేపథ్యంలో సినిమా ద్వారా ప్రజలకు దీని గురించి మరింత సమాచారం ఇవ్వాలనుకుంటున్నామని వెల్లడించారు. ప్రేమ పేరుతో చేసే ద్రోహాన్ని ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే కథ సిద్ధంగా ఉందని, నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ సినిమాలో 80 శాతం భాగాన్ని ఇండోర్‌లో, మిగిలిన 20 శాతం మేఘాలయలో చిత్రీకరించబోతున్నట్లు తెలిపారు.
దురదృష్టకర ఘటన
2025 మేలో రాజా తన భార్య సోనంతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. కొద్ది రోజులకే అతను కనిపించకుండా పోవడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. జూన్ 2న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని చెర్రాపుంజిలోని ఒక లోతైన లోయలో రాజా శరీరాన్ని ముక్కలుగా చేసిన స్థితిలో గుర్తించారు. ఈ కేసులో సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహాతో పాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఈ హత్య ముందే ప్లాన్ చేసిన దారుణ నాటకమని తేలింది.
ఇవి కూడా చదవండి
రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి