DK Shivakumar Power Share: కొంతమంది అధికారాన్ని పంచుకునేందుకు ఇష్టపడరు.. డీకే శివకుమార్ హాట్ కామెంట్స్
ABN , Publish Date - Aug 04 , 2025 | 06:45 AM
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరలేపాయి. అధికార పంపకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ (DK Shivakumar), ముఖ్యమంత్రి సిద్ద రామయ్యతో అధికార పంపకాల (Power Share) విషయంలో గిల్లి కజ్జాలు పడుతున్నారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఢిల్లీ(Delhi)లో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ సవాళ్లు అనే కార్యక్రమంలో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. గాంధీ కుటుంబాన్ని పొగుడుతూనే, తన రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకొచ్చిన తన కృషిని కూడా ప్రస్తావించారు.
అసాధారణ త్యాగం
2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన సంఘటనను డీకే గుర్తు చేశారు. రాష్ట్రపతి సోనియా గాంధీని ప్రధానిగా ప్రమాణం చేయమని అడిగినప్పుడు, ఆమె తనకు అధికారం ముఖ్యం కాదని చెప్పారని గుర్తు చేశారు. ఒక సిక్కు, మైనారిటీ, ఆర్థికవేత్త అయిన వ్యక్తి దేశాన్ని రక్షించగలడని నిర్ణయించి, అతన్ని ప్రధానమంత్రిని చేశారని డీకే అన్నారు. ఇది రాజకీయాల్లో అసాధారణమైన త్యాగమని, ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇలాంటి త్యాగం ఎవరూ చేయలేదని కొనియాడారు.
చాలా మంది కూడా..
అంతేకాదు ప్రస్తుత రోజుల్లో చిన్న పదవిని కూడా ఎవరైనా త్యాగం చేస్తారా? పంచాయతీ స్థాయిలో కూడా చాలామంది అలా చేయరని పేర్కొన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని పంచుకుంటారు. కానీ మనలో కొందరు అధికారాన్ని పంచుకోవడానికి కూడా ఒప్పుకోరని డీకే వ్యాఖ్యానించారు. ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా, సిద్ద రామయ్యతో అధికార పంపకాల గురించి చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తోంది.
డీకే వ్యాఖ్యలు..
సిద్దరామయ్య ఇటీవల ఈ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఎలాంటి అధికార పంపకాల ఒప్పందం లేదు. నేను పూర్తి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీకే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
డీకే శివకుమార్ తన రాజకీయ జీవితంలో చాలా కాలం నుంచి కాంగ్రెస్‌తోనే ఉన్నారు. కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన చేసిన కృషి అందరికీ తెలిసిందే. కానీ, అధికారం విషయంలో ఆయనకున్న ఆశలు, సిద్దరామయ్య నిర్ణయాల మధ్య ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి