Psychological Analysis: తెరవని తలుపుల వెనుక దాగిన చీకట్లు
ABN , Publish Date - Aug 04 , 2025 | 06:12 AM
తెలుగు నవల వెలువడిన తొలి రోజుల్లో నవలాకారులు పాత్రల బాహ్య సంఘర్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను అంతరంగ సంఘర్షణకు

తెలుగు నవల వెలువడిన తొలి రోజుల్లో నవలాకారులు పాత్రల బాహ్య సంఘర్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను అంతరంగ సంఘర్షణకు ఇచ్చేవారు కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తెలుగు నవలాసాహిత్యంపై పడిన ముఖ్యమైన ప్రభావాల్లో మనో విశ్లేషణవాదం, అస్తిత్వవాద సిద్ధాంతం ముఖ్యమైనవి. ఫ్రాయిడ్ సిద్ధాంతాలు, ముఖ్యంగా అచేతన మనస్సు (Unconscious Mind), రిప్రెషన్ (Repression), లిబిడో (Libido), ఒడిపస్ కాంప్లెక్స్ వంటి భావనలు, తెలుగు సాహిత్యంలో కొంతమంది రచయితల రచనల్లో స్పష్టంగా లేదా అంతర్లీనంగా కనిపిస్తాయి. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాద దృక్పథంతో రచనలో మనోవిశ్లేషణ చేసిన నవలాకారుల్లో త్రిపురనేని గోపీచంద్ ప్రముఖులు. ఆయన రాసిన ‘అసమర్థుని జీవయాత్ర’, ‘మెరుపుల మరకలు’, ‘పిల్ల తెమ్మెర’, ‘గడియ పడని తలుపులు’ మొదలైన నవలల్లో మనస్తత్వ విశ్లేషణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ నవల, వడ్డెర చండీదాస్ ‘హిమజ్వాల’, ఆర్.ఎస్.ఎస్. సుదర్శనం ‘సంసార వృక్షం’, శీలా వీర్రాజు ‘మైనా’, భాస్కరభట్ల కృష్ణారావు ‘వెల్లువలో పూచిక పుల్లలు’, కోడూరు రామమూర్తి ‘నీటిలో నీడలు’... మొదలైన నవలలు ఈ కోవలోనివే. చలం రచనలు ముఖ్యంగా ‘మైదానం’, ‘సావిత్రి’ వంటివి లైంగిక సంఘర్షణలు, సామాజిక నిషేధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం పోరాటాన్ని చిత్రీకరించాయి. విశ్వనాథ సత్యనారాయణ ‘ఏకవీర’ నవలలో కూడా ఈ సిద్ధాంతానికు సంబంధించిన అవగాహన కనపడుతుంది.
ఇటీవల తెలుగులో వచ్చిన నవలల్లో మనస్తత్వ విశ్లేషణ గురించి ప్రస్తావించేటప్పుడు కాశీభట్ల వేణుగోపాల్ రాసిన ‘నేను చీకటి’, ‘తపన’ మొదలైన అన్ని నవలల గురించీ పేర్కొనాలి. ఈ నవలల్లో పాత్రల అంతరంగ సంఘర్షణలను ఆవిష్కరించడం కోసం కాశీభట్ల వేణుగోపాల్ చైతన్యస్రవంతి విధానాన్ని విస్తృతంగా ఉపయోగించారు. ‘నేను చీకటి’ నవల ఒక మనో వైజ్ఞానిక నవల చేసే పనే గాక సామాజిక స్పృహతో రాసిన నవల చేసే పనిని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మనిషి మనసులోని చీకటికోణాల ఆవిష్కరణకు చైతన్య స్రవంతి శైలి ఉపయోగపడుతుందని భావించి తాను ఆ శైలిని ఉపయోగిస్తున్నట్లు కాశీభట్ల చెప్పుకొన్నారు. ఆయన ‘తెరవని తలుపులు’ నవల మనసులోని సంఘర్షణను, తెలియని భయాలను, అణచివేయబడిన ఆలోచనలను, సామాజిక ఒత్తిడుల మధ్య సంఘర్షణలను చిత్రీకరిస్తుంది. ‘తెరవని తలుపులు’ శీర్షికే మనసులో బంధించబడిన భావాలను, తెరవడానికి ధైర్యం లేని రహస్యాలను సూచిస్తుంది. ఈ నవలలో చైతన్య స్రవంతి శైలి విరివిగా కనిపిస్తుంది. ఈ వాక్యాలను ఒకసారి పరిశీలించండి: ‘‘ఫాంటేన్హెడ్... ర్యాండ్... వియ్దలవింగ్... లివింగ్... జీవితం... తంత్రం.. కుతంత్రం... మంత్రం... పుష్పమంత్రం... మంత్ర పుష్పం... పుష్పం? శష్పం... సుసరభేత్... కామ నిలయా ఘాటరోమాటవీ సముత్పాటనా పరిపాటికై పాటల గంధులు దీనిని పాటింతురు...’’.
ఫణిహారం వల్లభాచార్య– ఈ నవలను మనస్తత్వశాస్త్రంతో ఎంతగానో విశ్లేషించవచ్చనీ, అస్తిత్వవాదంతో దీని లోతులకు ఈదుకుంటూ వెళ్ళవచ్చనీ, అయాన్ రాండ్ ‘ద వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్‌నెస్’ పుస్తకం మొత్తాన్నీ దీనికి అన్వయించవచ్చనీ అంటారు. కాశీభట్ల వేణుగోపాల్ ‘తెరవని తలుపులు’ నవలను సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం, ఎరిక్సన్ మనోసాంఘిక విశ్లేషణ సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకొని విశ్లేషించవచ్చు. ఈ నవలలలోని కథానాయకుడు ఆధునిక జీవితం అందించిన సౌఖ్యాలు పొందిన బ్రాహ్మణుడు, తాగుబోతు, చైన్ స్మోకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. అతడి భార్య లెక్చరర్. కొడుకు అమెరికాలో చదువుకోవాలి అనుకొంటూ ఉంటాడు. ఆర్థికంగా స్థిరంగా ఉన్న ప్పటికీ కథానాయకుడి మానసిక జీవితం ఒంటరితనంతో, అస్తిత్వ శూన్యతతో నిండి ఉంది. స్మోకింగ్ వల్ల కాళ్ళు కోల్పోయే స్థితిలో, ఆపరేషన్‌కు ముందు నిద్రమాత్రలతో జీవితాన్ని ముగిస్తాడు. ఫ్రాయిడ్ నిర్వచించిన ‘ఇడ్’, ‘ఈగో’, ‘సూపర్–ఈగో’ భావనలను ఈ కథకు అన్వయించవచ్చు. నవలలోని కథానాయకుడి పాత్రలోని ‘ఇడ్’ సమాజం ఆమోదించని, అసంగతమైన కోరికలను జనింపజేస్తుంది. ఉదాహరణకు కథానాయకుడు తన కుటుంబ సభ్యుల గురించి ఇలా అనుకొంటాడు: ‘‘నేను విడిపోతే వీళ్ళకు దారి సుగమం అవుతుంది. అట్లా కావడం నాకు ఇష్టం లేదు. కలిసుండాలి. వాళ్ళని హింసించాలి. వాళ్ళు సుఖాలు అనుకొంటున్నవాటికి నేను అడ్డం పడాలి’’. తన కుటుంబం పట్ల అతని ఈ భావనలను సమాజం హర్షించదు. సమాజ ఆమోదం లేని ఇలాంటి అనేక ఆలోచనలు కథానాయకుడి మస్తిష్కంలోకి వస్తూంటాయి. అతని పాత్ర అంతరంగాన్ని ‘ఇడ్’ ఎంత డామినేట్ చేసినప్పటికీ కొన్ని విషయాల్లో ‘ఈగో’ ప్రభావంచేత అతడి ప్రవర్తన సమాజ ఆమోదయోగ్యంగా మారుతుంది. ఉదాహరణకు ఒకచోట కథానాయకుడు ‘‘ఆ పెద్దావిడ సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో నాకు తెలుసు. మీ ముందు ఆమెను తిట్టలేను కదా... అందుకే... ఏం చెయ్యమంటావు నన్ను చెప్పు?’’ అంటాడు. తిట్టాలని ఉన్నా పెద్దావిడను అందరిముందు తిట్టడం తప్పు అనే ఆలోచనకు ఫ్రాయిడ్ ప్రకారం మనిషిలో ఉన్న ఈగో కారణం. ఇక ఆదర్శవంతమైన ప్రవర్తనకు కారణం ‘సూపర్ ఈగో’. ఈ నవలలోని ప్రధాన కథానాయకుడి పాత్ర అనేక ఒత్తిడుల వల్ల తన నిజమైన ఆలోచనలను దాచుకోవడం చేత అవి ‘తెరవని తలుపులు’గా మిగిలిపోతాయి.
మనిషి తన మానసిక సంఘర్షణలను అధిగమించడానికి పలురకాల రక్షకతంత్రాలను (డిఫెన్స్ మెకానిజమ్స్) అనుసరిస్తాడని ఫ్రాయిడ్ ప్రతిపాదిస్తారు. ఈ నవలలోని అనేక పాత్రలు ఈ తరహా రక్షక తంత్రాలను అనుసరిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ‘నిరాకరణం’ (డినైయల్) అనే రక్షక తంత్రాన్ని కథానాయకుడు అనుసరించే సందర్భం మనకు నవలలో కనిపిస్తుంది. ‘‘నాకు ఏ రోగం లేదు. ఏదో రోగముందేమో అనుకొనే రోగం. హైపోకాండ్రియా అనే రోగం’’ అని కథానాయకుడు అంతరంగంలో అనుకొంటాడు. అలాగే నార్సిజమ్‌కు సంబంధించిన భావనలూ నవలలో ఉన్నాయి. కథానాయకుడు అంతరంగంలో, ‘‘మనుషులు ఎవరిని వారు ప్రేమించుకుంటారన్న భావన నాలో తీవ్రంగా ఉంది. నేనూ అంతే గదా! నన్ను నేను నార్సిస్టిక్‌గా ప్రేమించుకొంటాను’’ అనుకొంటాడు. ఎరిక్సన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తన సాంఘిక మనోవికాస సిద్ధాంతంలో వ్యక్తి అహం ఎనిమిది సాంఘిక దశల ద్వారా పయనిస్తూ వికసిస్తుందని చెబుతారు. ఆ ఎనిమిది దశల్లో ఆరవ దశ అయిన ‘సన్నిహితం – ఏకాంతం’ అతిముఖ్యమైనది. ఈ దశలోని వ్యక్తులు ఏ కారణం చేతనైనా తమ ఆశలు, సిద్ధాంతాలు, ఆలోచనలను సరిగ్గా ఏర్పరచుకోలేక పోయినప్పుడు ఇతరులతో కలవలేక ఏకాంతంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఈ నవలలోని కథానాయకుడు ఈ తరహాకు చెందినవాడే. సార్త్ర్ అస్తిత్వవాద అంశాలు కూడా నవలలో కనిపిస్తాయి. ఉదాహరణకు: ‘‘సిగరెట్‌కు ఉన్న అస్తిత్వం నీ ఆలోచనల్లో ఉంది. సిగరెట్‌కై సిగరెట్‌కు అస్తిత్వం లేదు. నీకు అది ఉంది. దానికి నీవు లేవు. సార్త్ర్... మెల్లకన్ను సార్త్ర్... బీఇంగ్ అండ్ నథింగ్‌నెస్... అస్తిత్వమూ అస్తిత్వ రాహిత్యమూ.. రాహిత్యం... నా రాహిత్యం... నేన్లేకపోతే నాయీ ప్రపంచం నాకు లేదు...’’. ‘తెరవని తలుపులు’ నవల కాశీభట్ల వేణుగోపాల్ సాహిత్య ప్రతిభకు నిదర్శనం. మనోవిశ్లేషణాత్మక దృక్కోణం నుంచి ఈ నవలను చూసినప్పుడు ఇది మనిషి మనస్సులోని సంక్లిష్టతలను, అస్తిత్వ సంక్షోభాన్ని, సామాజిక ఒత్తిడులను అద్భుతంగా చిత్రీకరిస్తుంది. ఫ్రాయిడ్, ఎరిక్సన్, సార్త్ర్ వంటి సిద్ధాంతకర్తల దృక్కోణాల ద్వారా ఈ నవలను పరిశీలించడం వల్ల పాత్రల్లోని అంతర్గత సంఘర్షణలు స్పష్టమవుతాయి. ఈ నవల తెలుగు సాహిత్యంలో మైలురాయిగా నిలిచిపోతుంది.
-మారుతి పౌరోహితం
& 94402 05303