Parliment Security Breach: పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. నిందితులకు బెయిల్
ABN , Publish Date - Jul 02 , 2025 | 02:49 PM
నిందితులపై తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వసనీయ పత్రాలు, మెటీరియల్ ఉన్నందున 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద శిక్షార్హులని కోర్టుకు విన్నవించారు.

న్యూఢిల్లీ: పార్లమెంటులో భద్రతా వైఫల్యం (Parliament Security Breach) కేసులో 2023 డిసెంబర్‌లో నిందితులుగా ఉన్న నీలమ్ ఆజాద్, మహేష్ కుమావత్‌లకు ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు బెయిలు మంజూరు చేసింది. నిందితులు రూ.50,000 చొప్పున బెయిల్ బాండ్, పూచీకత్తులను సమర్పించాలని జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. బెయిల్ ఆర్డర్‌లో కఠినమైన షరతులు విధించింది. నిందితులు మీడియా సమావేశాల్లో పాల్గొనరాదని, ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టరాదని ఆదేశించింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటలకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని, ఢిల్లీ విడిచిపెట్టి వెళ్లరాదని ఆదేశాలిచ్చింది.
నిందితులపై తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వసనీయ పత్రాలు, మెటీరియల్ ఉన్నందున 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద శిక్షార్హులని కోర్టుకు విన్నవించారు.
2023 ఘటన
2023 పార్లమెంటు శీతాకాల సమవేశాల వేళ లోక్‌సభలో జీరో అవర్ జరుగుతుండగా పబ్లిక్ గ్యాలరీ నుంచి సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. పసుపురంగుతో కూడిన పొగ విడుదల చేయడంతో ఎంపీలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదే సమయంలో అమోల్ శిందే, నీలమ్‌లు పార్లమెంటు వెలుపల కలర్ గ్యాస్ వదులుతూ నియంతృత్వం పనిచేయదంటూ నినాదాలు చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది ఈ నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించడంతో పార్లమెంటు సమగ్ర భద్రతా బాధ్యతలను సీఐఎస్ఎఫ్‌కు కేంద్రం అప్పగించింది.
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వ ఉద్యోగుల మ్యారేజ్ అలవెన్స్ పెంపు..
ఊటీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి