Haryana Doctor Arrested: ఢిల్లీ పేలుడు ఘటన.. మరో వైద్యురాలు అరెస్ట్
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:49 PM
ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ముగ్గురు వైద్యులను అరెస్టు చేయగా.. తాజాగా హర్యానాకు చెందిన మరో వైద్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు( Delhi Car Blast) ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు దేశ వ్యతిరేక శక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా వైట్ కాలర్ టెర్రరిజంపైనే దృష్టి సారించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న హర్యానాకు చెందిన వైద్యురాలు ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నట్లు (Haryana Woman Doctor Detained) అక్కడి పోలీసులు వెల్లడించారు. జైషే మహ్మద్, అన్సార్ గజ్‌వత్ ఉల్ హింద్ అనే ఉగ్రసంస్థలతో సంబంధమున్న అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ అనే ముగ్గురు డాక్టర్లును ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరైన అదీల్ అహ్మద్‌తో ప్రియాంక శర్మకు పరిచయం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆదివారం నాడు జమ్ముకాశ్మీర్ అనంత్‌నాగ్‌లో ప్రియాంక ఉంటున్న హాస్టల్ పై దాడి చేసి.. ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మొబైల్, సిమ్ కార్డు ద్వారా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 200 మంది కాశ్మీర్ వైద్యుల( Kashmir doctors terrorism)పైన, దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లోని కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువున్న కశ్మీర్ విద్యార్థులపైనా నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో పేలుడుకు కారణమైన ఐ20 కారు నడిపిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ నబీ అని భద్రతా ఏజెన్సీ సంస్థలు గుర్తించాయి.
అలానే అతడితో సంబంధమున్న మరో ఐదుగురు వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో వారితో కలిసి చదువుకున్న, పని చేస్తున్న ఇతర వైద్యులపైనా అధికారులు నిఘా పెట్టారు. ఉగ్ర కుట్రలో ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీ (Al Falah University) సిబ్బంది పాత్ర ఉండడం, నిందితులకు సంబంధించిన మరో కారు కూడా అక్కడే లభ్యం కావడంతో క్యాంపస్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. అంతేకాక క్యాంపస్ మొత్తాన్ని ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. శనివారం అక్కడే చదివిన మరో ఇద్దరినీ ఎన్‌ఐఏ అధికారులు(NIA investigation) అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
నా చెల్లెల్ని అవమానిస్తే సహించను... రోహిణికి సపోర్ట్‌గా తేజ్ ప్రతాప్
ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి ఫార్ములా
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.