Lalu Family Feud: లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:07 PM
బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లతో ఘోరమైన పరాజయం చవిచూసిన నేపథ్యంలో లాలూ కుటుంబంలో సంక్షోభం మొదలైంది. ఆర్జేడీ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు తనపై తేజస్వి, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, రమీజ్ నేమత్ తనను అవమానించి, దాడి చేశారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆరోపణలు చేశారు.
పాట్నా: లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో తలెత్తిన కల్లోలం మరింత తీవ్రమైంది. ఇప్పటికే తనను అవమానించి, దాడి చేసినందుకు కుటుంబాన్ని వదిలిపెడుతున్నట్టు లాలూ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) ప్రకటించారు. పాట్నాలోని తన కుటుంబ నివాసాన్ని విడిచిపెట్టారు. తాజాగా ఆమె బాటలో లాలూ మరో ముగ్గురు కుమార్తెలు రాజ్యలక్ష్మి, రాగిణి, చందా కూడా పాట్నా నివాసాన్ని విడిచిపెట్టారు. తన పిల్లలతో కలిసి వీరంతా ఆదివారంనాడు ఢిల్లీకి చేరుకున్నారు.

బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లతో ఘోరమైన పరాజయం చవిచూసిన నేపథ్యంలో లాలూ కుటుంబంలో సంక్షోభం మొదలైంది. ఆర్జేడీ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు తనపై తేజస్వి, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, రమీజ్ నేమత్ తనను అవమానించి, దాడి చేశారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయాలకు, తన కుటుంబానికి ఉద్వాసన చెబుతున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఇంటి నుంచి కూడా బయటకు వచ్చేశారు. లాలూకు ఇటీవల తన కిడ్నీని ఇచ్చిన రోహిణి ఆచార్య బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శరణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా పరిణామాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ, తన సొంత కుటుంబాన్ని, పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఎంతో పాపం చేశానన్నారు.

తేజ్ ప్రతాప్ ఒక్కడే..
రోహిణి ఆచార్య ఆరోపణలపై ఇంతవరకూ లాలూ కుటుంబంలో ఆమె పెద్దన్నయ్య తేజ్ ప్రతాప్ ఒక్కరే స్పందించారు. గత ఏడాది తేజ్ సైతం పార్టీ నుంచి, సొంత కుటుంబం నుంచి బహిష్కరణను గురయ్యారు. తనకు అవమానం జరిగితే భరించానని, తన చెల్లిలికి అవమానం జరగడాన్ని మాత్రం సహించేది లేదని తాజాగా తేజ్ స్పష్టం చేశారు. లాలూ ప్రసాద్ సైగచేస్తే చాలనీ, ద్రోహులను బిహార్ ప్రజలు పూడ్చిపెడతారని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
నా చెల్లెల్ని అవమానిస్తే సహించను... రోహిణికి సపోర్ట్‌గా తేజ్ ప్రతాప్
ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి ఫార్ములా
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.