Delhi Blast: ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:11 PM
ఢిల్లీ పేలుళ్ల ఘటనలో ఆత్మాహుతి దాడిగా పరిగణిస్తున్న దర్యాప్తు బృందం.. సంబంధిత వ్యక్తిని గుర్తించి, ఫొటోను విడుదల చేసింది. సోమవారం దేశ రాజధానిలో తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ పేలుళ్ల(Delhi Blast) కేసులో ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డా.ఉమర్ మహమ్మద్(Umar Mohammad) ముఖచిత్రం బయటపడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట(Red Fort) సమీపంలో పేలిన వైట్ హ్యుండాయ్ ఐ20(Hundai I20) కారు ఉమర్‌కు చెందినదిగా పోలీసులు తేల్చారు. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించగా, 20 మంది క్షతగాత్రులయ్యారు. దీనిని ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న పోలీసులు.. అతడి ముఖాన్ని యాక్సెస్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి జమ్ము కశ్మీర్ లో అతడి తల్లి, సోదరులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది.
పేలుడు ఘటనకు ముందు కారు సీసీటీవీ దృశ్యాలు..

ఉమర్ 1989 ఫిబ్రవరి 24న జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో జన్మించాడు. ఇతడు ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీ(Al-Falah Medical College)లో వైద్యునిగా పనిచేస్తున్నాడు. జమ్ము కశ్మీర్, హరియాణా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 'వైట్ కాలర్' టెర్రర్ మాడ్యూల్‌లో సోమవారం అరెస్టైన ఇద్దరు వైద్యులు అదిల్ అహ్మద్ రాథర్, ముజామ్మిల్ షకీల్‌లతో ఇతడికి సాన్నిహిత్యం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొన్ని రోజులుగా మాడ్యూల్‌లో ఉన్న ఆ ఇద్దరు కీలక సభ్యులను అరెస్ట్ చేసిన దర్యాప్తు బృందం.. వారి నుంచి సుమారు 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. విషయం తెలుసుకున్న ఉమర్.. ఫరీదాబాద్ నుంచి పరారయ్యాడు. అతడు భయాందోళనకు గురై ఇలా ఆత్మాహుతికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడి చేసేందుకు ఉమర్, అతడి సన్నిహితులు అమ్మోనియం నైట్రేట్ ఇంధన ఆయిల్(ANFO)ను వినియోగించినట్లుగా తెలుస్తోంది. కారులో డిటోనేటర్‌ను ఉంచి లాల్‌ఖిలా సమీపంలో రద్దీగా ఉండే ప్రదేశంలో ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారు.
పేలుళ్లను అమలు చేశారిలా..
ఎర్రకోట సమీపంలో పేలిన హ్యుండాయ్ ఐ20 వాహనం.. బాదర్‌పూర్(Badarpur) సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలలో నిక్షిప్తమయ్యాయి. HR 26 CE 7674 నంబర్ ప్లేట్ కలిగిన ఆ కారును.. ఔటర్‌రింగ్ రోడ్ నుంచి మధ్యాహ్నం గం.3:19ల ప్రాంతంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పార్క్ చేశారు. ఆ తర్వాత సాయంత్రం గం.6:30లకు అక్కడి నుంచి బయల్దేరిందని అధికార వర్గాలు తెలిపాయి. అనుమానిత ఆత్మాహుతి దళ సభ్యుడు ఒక్క నిమిషం కూడా ఆ కారును వదిలివెళ్లలేదని పేర్కొన్నాయి.

చేతులు మారిన కారు..
దాడిలో ఉపయోగించిన కారు అనేకసార్లు చేతులు మారిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తొలుత ఆ కారును గురుగ్రామ్‌కు చెందిన సల్మాన్ అనే వ్యక్తి 2025 మార్చిలో ఓఖ్లాలోని దేవేందర్‌కు అమ్మాడు. ఆ తర్వాత దేవేందర్ దానిని అంబాలా వాసికి విక్రయించాడు. ఆ వ్యక్తి నుంచి అమీర్‌కు, ఆపై తారిఖ్, ఉమర్‌లకు చేతులు మారి పుల్వామాకు చేరింది. అక్కడ అమీర్, తారిఖ్, రశీద్‌ల మధ్య సంబంధాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో అమీర్, తారిఖ్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఢిల్లీ పోలీసులు.
వైద్యులుగా పనిచేస్తూ..
ఫరీదాబాద్ నుంచి ఇటీవల అనేక మంది వైద్యులు అరెస్ట్ కాగా.. వారు ఉగ్రవాద దాడికి ప్లాన్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. వీరిలో అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాల(జీఎంసీ) వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ ఒకడు. అతడు.. శ్రీనగర్‌లోని జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రసంస్థకు మద్దతుగా పోస్టర్లు వేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుసుకున్న పోలీసులు.. ఈనెల 6న ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఓ ఆసుపత్రిలో అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేయగా.. ముజామ్మిల్ షకీల్ అనే మరో వైద్యుడికి ఇందులో సంబంధమున్నట్టు తేలింది. అతణ్ని ఈనెల 10న అరెస్ట్ చేశారు. షకీల్‌ను అరెస్ట్ చేసిన మాడ్యూల్లోనే ఓ మహిళా వైద్యురాలు షహీన్ షాదిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె కారులోంచి ఒక ఏకే-47 రైఫిల్, లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..
ఆ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో ఇకపై వందేమాతరం పాడాల్సిందే.!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి