Share News

Delhi Bomb Blast: వైట్‌కాలర్‌ ఉగ్రభూతం

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:10 AM

అత్యంత ప్రమాదకరంగా దేశంలో కొత్త రూపంలో వేళ్లూనుకుంటున్న వైట్‌ కాలర్‌ ఉగ్రవాదానికి కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలతో కలిసి జమ్మూకశ్మీర్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. దేశ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నా...

Delhi Bomb Blast: వైట్‌కాలర్‌ ఉగ్రభూతం

  • మూడు రాష్ట్రాల్లో 8 మంది టెర్రరిస్టుల అరెస్టు

  • వీరిలో ముగ్గురు వైద్యులు, వారిలో ఒకరు మహిళా డాక్టర్‌

  • 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

శ్రీనగర్‌/ఫరీదాబాద్‌, నవంబరు 10: అత్యంత ప్రమాదకరంగా దేశంలో కొత్త రూపంలో వేళ్లూనుకుంటున్న వైట్‌ కాలర్‌ ఉగ్రవాదానికి కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలతో కలిసి జమ్మూకశ్మీర్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. దేశ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 15 రోజుల పాటు అత్యంత పకడ్బందీగా నిర్వహించిన ఆపరేషన్‌లో జైషే మహ్మద్‌, అన్సార్‌ ఘజవత్‌ ఉల్‌ హింద్‌ (ఏజీయూహెచ్‌) సంస్థలకు చెందిన 8 మంది ఉగ్రదులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు వైద్యులు ఉండటం, వారిలో ఒక మహిళ కూడా ఉండటంకలకలం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో అరెస్టు చేసిన డాక్టర్‌తో కలుపుకుంటే ఈ ఉగ్రనెట్‌వర్క్‌లో అరెస్టు అయిన వైద్యుల సంఖ్య నాలుగుకు పెరిగింది. అరెస్టయిన వారిలో ఏడుగురు జమ్మూకశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు. వీరి నుంచి మొత్తం 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఇందులో అమోనియం నైట్రేట్‌, పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌ వంటి పదార్థాలు ఉన్నాయి. ఒక ఏకే 56, ఒక ఏకే క్రింకోవ్‌ తుపాకితోపాటు చైనీస్‌ స్టార్‌, బెనెట్టా పిస్తోళ్లు, బాంబుల తయారీలో ఉపయోగించే బ్యాటరీలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

పోస్టర్లపై కూపీ లాగితే..

జమ్మూకశ్మీర్‌ పోలీసుల కథనం ప్రకారం శ్రీనగర్‌లో అక్టోబర్‌ 19న జైషే మహ్మద్‌కు మద్దతుగా వెలసిన పోస్టర్లపై కూపీ లాగడంతో ఈ భారీ ఉగ్ర నెట్‌వ ర్క్‌ బట్టబయలైంది. ఈ పోస్టర్ల వెనుకు జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ అదీల్‌ రాథర్‌, హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉంటున్న అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ముజమ్మిల్‌ గనయి ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 6న అదీల్‌ను అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఆదివారం ముజమ్మిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉంటున్న అదీల్‌ను, హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉంటున్న ముజమ్మిల్‌ను విమానంలో శ్రీనగర్‌కు తరలించారు. ముజమ్మిల్‌ అద్దెకు తీసుకున్న రెండు ఇళ్లలో కనిపించిన పేలుడు పదార్థాలు, ఆయుధాలు చూసి పోలీసులే నివ్వెరపోయారు. ముజమ్మిల్‌ వద్దనే ఏకంగా 360 కిలోల పేలుడు పదార్థాలు, ఏకే తుపాకీ లభించాయి. ముజమ్మిల్‌, అదీల్‌ ఫోన్లలో పాకిస్థాన్‌కు చెందిన నంబర్లను గుర్తించారు. ముజమ్మిల్‌కు ఇంటిని అద్దెకు ఇచ్చిన ఒక మౌలానాను కూడా సోమవారం అరెస్టు చేశారు.


చారిటీల ముసుగులో ఉగ్ర ప్రచారం

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెరగటంతో పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌తోపాటు, భారత్‌లో ఐఎ్‌సఐఎ్‌సకు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ ఏజీయూహెచ్‌లు కొత్త మార్గాలను అనుసరిస్తున్నట్లు ఈ కేసు తేటతెల్లం చేసింది. సమాజంలో మంచి పేరున్నవారు, ఉన్నత విద్యావంతులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు తేలింది. అరెస్టయిన ఉగ్రవాదులు చారిటీలు, విద్యా సంస్థలకు నిధుల సేకరణ ముసుగులో ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారని జమ్ముకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ‘దేశంలో వైట్‌కాలర్‌ ఉగ్రవాద వ్యవస్థ క్రమంగా వేళ్లూనుకుంటున్నట్లు ఈ దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదంవైపు ఆకర్షితులైన ప్రొఫెసర్లు, విద్యార్థులు పాకిస్థాన్‌, ఇత విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ప్రొఫెషనల్‌, విద్యా సంస్థల ద్వారా నిధులు సమీకరిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు, ఐఈడీ బాంబులు తయారు చేసే పేలుడు పదార్థాలు, ఇతర మౌలిక వసతులు సమకూరుస్తున్నారు’ అని పోలీసులు వెల్లడించారు.

అరెస్టయిన ఉగ్ర డాక్టర్లు

డాక్టర్‌ అదీల్‌ రాథర్‌: ఇతడి స్వస్థలం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా కాజీగుండ్‌. అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో గత ఏడాది అక్టోబర్‌ 24 వరకు ఇతడు రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేశాడు. ఇతడికి జైషే మహ్మద్‌తోపాటు ఏజీయూహెచ్‌తోనూ సంబంధాలున్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఈ నెల 6న అతన్ని అరెస్టు చేశారు.

డాక్టర్‌ ముజమ్మిల్‌ షకీల్‌ గనయి: ఇతడు కూడా జమ్మూకశ్మీర్‌కు చెందినవాడే. హర్యానాలోని ధౌజ్‌లో ఉన్న అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ అక్కడే రెండు వేర్వేరు ఇళ్లను అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఇతడి వద్దనే బాంబుల తయారీకి ఉపయోగించే సామగ్రి భారీ మొత్తంలో పట్టుబడింది. రాథర్‌ ఇచ్చిన సమాచారంతో ఇతడిని ఆదివారం అరెస్టు చేశారు. శ్రీనగర్‌లో జైషే మహ్మద్‌ పోస్టర్లు వేయటంతో ఇతడి హస్తం కూడా ఉంది.

మహిళా డాక్టర్‌: అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలోనే పనిచేస్తున్న మరో మహిళా డాక్టర్‌ను కూడా ఈ నెల 7న అరెస్టు చేశారు. ఆమె కారులో ఒక కారన్‌ అసాల్ట్‌ రైఫిల్‌ లభించటం గమనార్హం. ఆమె పేరు ఇతర వివరాలను పోలీసులు బయటపెట్టలేదు.

డాక్టర్‌ అహ్మద్‌ సయేద్‌ మొహియుద్దీన్‌: హైదరాబాద్‌కు చెందిన ఈ డాక్టర్‌ను గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు ఇంట్లో సొంతంగానే రెసిన్‌ అనే విషపదార్థం తయారుచేస్తున్నట్లు గుర్తించారు.

Updated Date - Nov 11 , 2025 | 03:27 PM