Share News

Digital Voting App: బిహార్‌లో మొబైల్‌ ఈ-ఓటింగ్‌

ABN , Publish Date - Jun 29 , 2025 | 05:15 AM

దేశంలో ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్‌ ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. అందులో నూతనంగా తీసుకొచ్చిన మొబైల్‌ ఈ-ఓటింగ్‌ ఒకటి. దీనిని దేశంలోనే తొలిసారి బిహార్‌లో ప్రారంభించారు. దీంతో మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటు వేసే అవకాశం బిహార్‌ ఓటర్లకు దక్కింది.

Digital Voting App: బిహార్‌లో మొబైల్‌ ఈ-ఓటింగ్‌

  • యాప్‌ ద్వారా ఓటు వేసే అవకాశం.. దేశంలోనే తొలిసారి ప్రారంభం

  • మునిసిపల్‌ ఎన్నికల్లో అందుబాటులోకి

  • వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల కోసమే

  • రిజిస్టర్‌ చేసుకున్న 10వేల మంది

పాట్నా, జూన్‌ 28: దేశంలో ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్‌ ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. అందులో నూతనంగా తీసుకొచ్చిన మొబైల్‌ ఈ-ఓటింగ్‌ ఒకటి. దీనిని దేశంలోనే తొలిసారి బిహార్‌లో ప్రారంభించారు. దీంతో మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటు వేసే అవకాశం బిహార్‌ ఓటర్లకు దక్కింది. ఈ పైలట్‌ ప్రాజెక్టును స్థానిక మునిసిపల్‌ ఎన్నికల్లో ఆరు కౌన్సిల్స్‌ పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్‌ యాప్‌ను వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, వలస కార్మికులతో పాటు పోలింగ్‌ స్టేషన్‌కు రాలేని విధంగా జబ్బు పడ్డ వ్యక్తుల కోసం అభివృద్ధి చేశారు. ఈ యాప్‌ ద్వారా ఓటు వేసే ప్రక్రియను పాట్నాలో మూడు, రోహతాస్‌లో రెండు, తూర్పు చంపారన్‌లోని ఓ కౌన్సిల్‌లో ప్రారంభించామని బిహార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దీపక్‌ ప్రసాద్‌ తెలిపారు. పోలింగ్‌ స్టేషన్‌కు రాకుండానే 50 వేల మంది ఈ ఓటింగ్‌ యాప్‌ ద్వారా ఓటు వేసే అవకాశం ఉందని, అయితే 10 వేల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని వెల్లడించారు.

ఎలా పనిచేస్తుంది..?

  • ట్యాంపర్‌ చేయడానికి వీలులేని టెక్నాలజీతో అత్యంత రక్షణ ప్రమాణాలతో ఈ మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీతో రికార్డు అయిన ఓట్లు అత్యంత భద్రతతో, మార్పుచేయడానికి వీల్లేకుండా స్టోర్‌ అవుతాయి.

  • ఫేస్‌ రికగ్నిషన్‌, మ్యాచింగ్‌ టెక్నాలజీ యాప్‌ లాగిన్‌, ఓటింగ్‌ సమయంలో ఓటర్ల గుర్తింపును ధ్రువీకరిస్తుంది. డిజిటల్‌ స్కానింగ్‌, ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌ (ఓసీఆర్‌).. ఓట్లను కచ్చితంగా లెక్కించడానికి సహాయ పడుతుంది.

  • ఆడిట్‌ ట్రెయిల్స్‌తో.. ఈవీఎంలో వీవీప్యాట్‌ లాగానే ఓట్లను సరిపోల్చే అవకాశం ఉంటుంది.

  • ఒక మొబైల్‌ నంబర్‌ నుంచి ఇద్దరు ఓటర్లు మాత్రమే రిజిస్టర్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటర్‌ ఐడీతో ప్రతి ఓటు నిర్ధారణ చేసుకున్నాకే ఓటు రికార్డు అవుతుంది.


బిహార్‌లో ఇలా మొదలైంది..

  • మొబైల్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌, ఓటింగ్‌ పక్రియ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుందని, మొదటిసారి డిజిటల్‌ ఓటర్లయినా ఏవిధమైన గందరగోళం లేకుండా ఓటు వేయవచ్చని ఎన్నికల అధికారులు చెప్పారు. ఈ-ఓటు ఎలా వేయాలంటే..

  • మొదట ఈ-ఎస్ఈసీబీహెచ్‌ఆర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. (ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది). ఎలక్టోరల్‌ రోల్‌లో రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నంబర్‌తో యాప్‌ను లింక్‌ చేయాలి. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా లేదా ఈ-ఎస్ఈసీబీహెచ్‌ఆర్‌ యాప్‌ ద్వారా ఎలక్షన్‌ రోజు ఓటు వేయవచ్చు.

ఓటర్ల జాబితా పునఃపరిశీలన

బిహార్‌లో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పునఃపరిశీలించే ప్రత్యేక పక్రియ ప్రారంభమైందని ఎన్నికల కమిషన్‌ తెలిసింది. కేవలం భారతీయులు మాత్రమే ఓటు వేసేందుకు రాజ్యాంగం హక్కు కల్పించిందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఓటర్లను తొలిగిస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈసీ ఈ ప్రకటన జారీ చేసింది. ఈఏడాది బిహార్‌తో మొదలుపెట్టి ఆరు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను ఈసీ చేపట్టింది. పుట్టిన ప్రాంతాన్ని పరిశీలించడం ద్వారా అక్రమంగా వలస వచ్చిన విదేశీయులను జాబితా నుంచి తొలిగించేందుకు కసరత్తు చేస్తోంది.

Updated Date - Jun 29 , 2025 | 05:19 AM