New Delhi: మహిళలకు ఆర్థిక సాయంపై వాగ్దాన భంగం.. అతిషి, ఆప్ ఎమ్మెల్యేల నిరసన
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:49 PM
ఖాళీ ఖజానాను తమకు అప్పగించారంటూ సీఎం రేఖా గుప్తా చెప్పడంపై అతిషి మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీకి తాము అప్పగించామన్నారు. సాకుల కోసం వెతుక్కోకుండా ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ నిలబెట్టుకోవాలని సూచించారు.

న్యూఢిల్లీ: మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయంపై బీజేపీ ప్రభుత్వం మొదట్లోనే మాటతప్పిందంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేఖాగుప్తా కార్యాలయం ఎదుట సోమవారంనాడు నిరసనకు దిగారు.
Rekha Gupta: ఖజానా ఖాళీ చేసిన ఆప్.. మహిళలకు రూ.2,500 సాయంపై సీఎం
''రెండ్రోజులుగా సమయం ఇవ్వాలని సీఎంని అడిగాం. ఇవ్వలేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎంను కలుస్తాం. మోదీ ఇచ్చిన హామీని క్యాబినెట్ తొలిసమావేశాల్లోనే అమలు చేయాలని సీఎంను కోరాం. వాళ్లు వాగ్దాన భంగం చేశారు. మార్చి 8వ తేదీ నుంచి మహిళా సమ్మాన్ యోజన కింద రూ.2,500 తప్పనిసరిగా ఢిల్లీ మహిళలకు చేరాలని ఆశిస్తున్నాం'' అని అతిషి చెప్పారు.
ఖాళీ ఖజానాను తమకు అప్పగించారంటూ సీఎం రేఖా గుప్తా చెప్పడంపై అతిషి మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీకి తాము అప్పగించామన్నారు. సాకుల కోసం వెతుక్కోకుండా ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ నిలబెట్టుకోవాలని సూచించారు. 2015లో ఆప్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఢిల్లీ మొత్తం బడ్జెట్ రూ.30,000 కోట్లు మాత్రమేనని, గత పదేళ్లలో బడ్జెట్ రూ.70,000 కోట్లకు పెరిగిందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను ఏదోసాకుతో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారని బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తాను అనుకుంటూనే ఉన్నానని అన్నారు.
కాగా, దీనికి ముందు రేఖాగుప్తా మీడియాతో మాట్లాడుతూ, ఆప్ ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని, దీనిపై అధికారులతో సమీక్ష జరిపామని చెప్పారు. సమగ్రమైన ప్రణాళికలతో మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.