Amit Shah: ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, లేబొరేటరీకి శంకుస్థాపన
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:25 PM
అమిత్ షా ఈ ఉదయం నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలకు శంకుస్థాపన చేశారు. రేపు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇంకా ఒడిశా రాష్ట్రాల డీజీపీ/ఏడీజీపీ అధికారులతో నక్సలిజంపై..

రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) జూన్ 22: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయం (ఆదివారం) ఆయన రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షా.. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో నిర్మించతలపెట్టిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (NFSU), సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (CFSL)లకు శంకుస్థాపన చేశారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి దీనిని చారిత్రక దినంగా అభివర్ణించారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి పునాది వేయడంతో ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌కు చారిత్రాత్మక రోజని సీఎం అన్నారు. దీంతోపాటు కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి హోంమంత్రి అమిత్ షా సమక్షంలో శంకుస్థాపన జరిగిందని సీఎం చెప్పారు. రాష్ట్రానికి ఇవి రెండు బహుమతులని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
ఇక, అమిత్ షా తన రెండు రోజుల పర్యటనలో భాగంగా భద్రతా సంబంధిత అంశాలపై నవ రాయ్‌పూర్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), ఛత్తీస్‌గఢ్ తోపాటు, పొరుగు రాష్ట్రాల అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP)తో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇంకా ఒడిశా రాష్ట్రాల డీజీపీ/ఏడీజీపీ, సీనియర్ అధికారులతో అమిత్ షా నక్సలిజంపై సమీక్ష సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.
ఇక, పర్యటనలో చివరి రోజైన రేపు అమిత్ షా రాష్ట్రంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న భద్రతా దళాలను కలుస్తారు. నాగరిక సమాజంలో హింస, రక్తపాతం, ఉగ్రవాదానికి చోటు లేదని అమిత్ షా అన్నారు. అందుకే నక్సలిజాన్ని నిర్మూలించడానికి తాము ప్రతిజ్ఞ చేసామని, ఆచరణలో చేసి చూపిస్తామని అమిత్ షా చెప్పారు.
ఇవి కూడా చదవండి
బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు.. బాలయ్య కీలక వ్యాఖ్యలు
ఇటీవలే పెళ్లైన యువకుడికి భారీ షాక్.. భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే..